ఆగ్రా : ప్రేయసిని సంతోషంగా ఉంచాలనుకున్నాడు. అందు కోసం ఆ ప్రేమికుడు దొంగగా మారాడు. ఈ విచిత్ర ఘటన యూపీలోని ఆగ్రాలో చోటు చేసుకుంది. ఆగ్రా నగరానికి చెందిన జయప్రకాష్ సింగ్ అలియాస్ జయకుమార్ (24) బీఎస్సీ పూర్తి చేశాడు. ఆగ్రాలోని యమునా నదీ ప్రాంతంలో అతను ఆంగ్లబాషా ట్యూటరుగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అతను ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో సెల్‌ఫోన్ల చోరీ కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. 8 మొబైల్ ఫోన్లను చోరీ చేశాడు.
పోలీసుల విచారణలో జయప్రకాష్ సింగ్ చెప్పిన విషయం విన్న పోలీసులు నివ్వెర పోయారు. తన ప్రియురాలి సంతోషం కోసమే తాను మొబైల్ ఫోన్లను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆమెను సంతోషంగా ఉంచేందుకు, ఆమె డిమాండ్ మేరకే అన్ని చోరీలు చేశానని చెప్పాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. చోరీలో దొరికిన మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జయకుమార్ చోరీ చేసిన సొత్తును విక్రయించేందుకు సహకరించిన బసురుద్దీన్ సింగ్ అలియాస్ సల్మాన్ కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై కూడా కేసు నమోదు చేశారు.