అమరావతి : ఇటీవల కాలంలో సంక్షేమ హాస్టల్స్‌లో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. వసతి గృహ సంక్షేమాధికారల పనితీరుపై ఉక్కుపాదం మోపారు. పనితీరు మెరుగుపర్చుకోవాలని హెచ్చరించడంలో అర్ధం ఉంది. పారిశుద్యం సక్రమంగా ఉండాలని సూచించడం ఆరోగ్యకరమైన అంశమే. అయితే నాణ్యతపై వార్డెన్లను నిలదీసిన అధికారులు ఒక్కసారి వార్డెన్లకు ఇస్తున్న మెనూ, ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ వివరాలు చూస్తే ఎవ్వరికైనా దిమ్మదిరగాల్సిందే. హాస్టల్స్‌లో మెరుగైన భోజనం పెట్టేందుకు ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఏ పూట ఏ భోజనం పెట్టాలో కూడా మెనూ నిర్ణయించింది. అయితే ఆ మెనూకు అయ్యే ఖర్చును మాత్రం కాకిలెక్కలు వేసి వార్డెన్ల నెత్తిన రుద్దారు. ప్రభుత్వం ఇచ్చిన మెనూ మార్చినా, పెట్టకపోయినా వార్డెన్లను ముద్దాయిలుగా నిల్చోబెడుతున్నారు. కానీ ఆ మెనూ అమలు చేసేందుకు అయ్యే ఖర్చు ఎంత? ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులెంత వివరాలు చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం వేస్తుంది. ఒకరూపాయి ఇచ్చి ఒకటిన్నర రూపాయి వస్తువు ఇవ్వమంటే ఎవ్వరైనా ఇవ్వగలరా? ఎవ్వరూ ఇవ్వలేరు. కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులు వేసిన లెక్కలు, ఇచ్చిన మెనూ అలాగే ఉంది. వార్డెన్లకు ఉదయం, సాయంత్రం మాత్రమే పిల్లలకు భోజనం పెట్టమని మెనూ ఇచ్చారు. వాటికీ లెక్కల్లో చుక్కలు చూపారు. పిల్లలను మద్యాహ్న భోజనం పాఠశాలలో తినమన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆదివారం పాఠశాల ఉండదు. పండుగ రోజుల్లో పాఠశాల ఉండదు. బంద్‌లు, ఇతర సెలవులేమైనా అడ్డొస్తే పాఠశాల ఉండదు. అలాంటి రోజుల్లో విద్యార్ధులు హాస్టల్‌లోనే ఉంటారు. వారికి భోజనం పెట్టకపోతే వార్డెన్ ముద్దాయి అవుతాడు. పెట్టినా ముద్దాయిగానే రికార్డులు చూపుతాయి. ఎందుకంటే అధికారులు ఇచ్చిన మెనూలో ఎక్కడా సెలవురోజుల్లో మద్యాహ్న భోజనం పెట్టాలని చూపలేదు. వాటికి సంబంధించిన నిధులు ఇవ్వలేదు. అలాంటప్పుడు భోజనం పెడితే ఎక్కడి నుండి తెచ్చి పెట్టినట్లో లెక్కలు చూపాలి.
సాధారణ హాస్టల్స్‌కు ఇస్తున్నట్లే ఆశ్రమ పాఠశాలలకూ బడ్జెట్ ఇస్తున్నారు. సాధారణ హాస్టల్స్‌లో రెండుపూటల భోజనం పెట్టిన బడ్జెట్‌తోనే ఆశ్రమ పాఠశాలలో మూడుపూటల భోజనం పెట్టాలట. ఇదీ ఐఎఎస్ స్థాయి అధికారులు రూపొందించిన విద్యార్ధుల భోజన ప్రణాళిక. దీంతో వార్డెన్లకు తలనొప్పింగా మారింది. పిల్లలు కళ్లెదుట కనిపిస్తున్నా నిబంధనల ప్రకారం భోజనం పెట్టాలంటే ఒప్పుకోవు. పెట్టకుంటే మనసు అంగీకరించదు. అందరికీ అన్నీ సాధ్యం కాకున్నా కనీసం భోజనం పెట్టడం బాధ్యతగా తీసుకుని పెట్టకుంటే వివాదాలు ఎదుర్కొనాల్సి వస్తుంది. హాస్టల్ నిర్వహణలో అలసత్వం వహించేవారిపై చర్యలు తీసుకోవాల్సిందే. కానీ నిర్వహణకు అవసరమైన నిధులు ఇవ్వడంలో కాకిలెక్కలు వేసి మోసం చేయాల్సిన అవసమేంటో ఉన్నతాధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది.
జిఒ నెంబర్ 82ప్రకారం నిర్ణయించిన మెనూలో ధరలు, పరిమాణం ఈ విధంగా ఉన్నాయి. ఐదోతరగతి లోపు పిల్లలకు నెలకు రూ.1250, 6నుండి 10వతరగతి వరకు పిల్లలకు రూ.1400చొప్పున నెలకు ఉపకారవేతనం ప్రభుత్వం ఇస్తుంది. అంటే రోజుకు 5లోపువారికి రూ.41.66, 6నుండి 10వ తరగతి వరకు విద్యార్ధికి రూ.46.65చొప్పున వస్తుంది.
బియ్యం కేజీ రూ.1చొప్పున 525గ్రాములకు రూ.0.60పైసలు, కందిపప్పు కేజీ రూ.60చొప్పున ఒక్కొక్క విద్యార్ధికి 40గ్రాముల ఆయిల్ పెట్టాలంటే రూ.0.67పైసలుగా మెనూ జిఒలో పేర్కొన్నారు. కానీ అధికారులు సూచించిన జిఒలోని కేజీ రూ.60ధర ప్రకారం 40గ్రాములు రూ.2.40అవుతుంది. అంటే రూ.1.73పైసలు తగ్గించి లెక్కకట్టారు. పామాలిన్ ఆయిల్ కేజీ రూ.69 ఒక్కొక్క విద్యార్ధికి పూటకు 30గ్రాములచొప్పున రూ.0.43పైసలు నిర్ణయించారు. వాస్తవానికి అధికారుల ధర ప్రకారం 30గ్రాములు రూ.2.07అవుతుంది. అంటే రూ.1.64తగ్గించి చూపారు. వంట గ్యాస్ కేజీ రూ.74.31కాగా ఒక్కొక్క విద్యార్ధికీ వంటకు 60గ్రాములు ఖర్చవుతుందని నిర్ణయం ప్రకారం రూ.0.81పైసలు చూపారు. వాస్తవానికి దీని ధర రూ.4.45అవుతుంది. ఇలా ప్రతీ వస్తువును తక్కువ ధర చూపి మెనూ నిర్ణయించారు. అధికారులు మెనూ పట్టికలో 5వతరగతి లోపువారికి రూ.41.66కు, 6నుండి 10తరగతుల వారికి రూ.46.65కు మెనూ లెక్కలు చూపారు. అధికారులు నిర్ణయించిన ధరలు, పరిమాణం ప్రకారం చూస్తే ఒక్కొక్క విద్యార్ధికి పూటకు రూ.55.26రూపాయలు అవుతుంది. అంటే ప్రభుత్వం ఇస్తున్న పూట బడ్జెట్ రూ.41.66అయితే వార్డెన్‌కు అయ్యే ఖర్చు రూ.55.26. అంటే వార్డెన్‌పై పడే అదనపు భారం ఒక్కొక్క విద్యార్ధిపై రూ.13.60పైసలు. దీనిని ఎక్కడినుండి వార్డెన్ తీసుకురావాలి? ఈ అదనపు బాదుడుకు తోడు సెలవు రోజుల్లో మద్యాహ్న భోజనం అదనపు బాధరమే. ఇలా కాకిలెక్కలతో వార్డెన్లను నేరం చేసేందుకు అధికారులే పురమాయిస్తూ దాడులు చేయడం వెనుక ఉద్దేశమేంటి? ప్రభుత్వం, ప్రజల దృష్టిలో మంచి మెనూ ఇస్తున్నా వార్డెన్లు పెట్టడంలేదని ముద్దాయిలను చేయడం ఏమిటనేది వార్డెన్లు అడుగుతున్న ప్రశ్నకు ఉన్నతాధికారులే సమాధానం చెప్పుకోవాల్సి ఉంది.