వేటపాలెం : సభ్య సమాజం తలదించుకునే ఘటన. అండగా ఉండాల్సిన వాడే కాటేశాడు. అంతే ఆ బాలిక తల్లడిల్లింది. తండ్రి వరసయ్యే వ్యక్తే అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు, పోలీసులు చెప్పిన కథనం ప్రకారం…. వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ బాపయ్యనగర్‌లో ఓ మహిళ నివాసముంటోంది. ఆమె భర్త ఏడేళ్లక్రితం మృతిచెందాడు. అప్పటి నుండి కుమార్తెతో పాటు చిన్నచిన్న పనులు చేసుకుంటూ అక్కడే కాలం వెళ్లదీస్తోంది. అయితే మూడేళ్ల క్రితం కందుకూరు చెందిన మల్లారపు శివయ్య ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అతను కూడా వారితో పాటు కలిసే ఉంటున్నాడు.
కందుకురులో ఇంట్లోంచి తీసుకెళ్లి…
ఇటీవల బాపయ్యనగర్ నుంచి ఆమె కుమార్తెను శివయ్య కందుకూరు తీసుకెళ్లాడు. తండ్రి వరుస కావడంతో తల్లి కూడా బాలికను అతని వెంట పంపించింది. అక్కడికెళ్లిన తర్వాత బాలికపై కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఆ బాలికను బాపయ్య నగర్ తీసుకొచ్చి వదిలి వెల్లాడు. తనపై జరిగిన విషయం ఆ బాలిక తన తల్లికి చెప్పడంతో ఘాతుకం వెలుగుచూసింది. కందుకూరు తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఓ చెట్టుకు కట్టేసి అత్యాచారం చేశాడని బాలిక తన తల్లి వద్ద వాపోయింది. ఘటనపై బాధితురాలి తల్లి గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ సీఐ వి భక్తవత్సలరెడ్డి తెలిపారు.