Home ఆంధ్రప్రదేశ్ ఆ మూడింటి చుట్టూనే పవన్ ప్రదక్షిణలు

ఆ మూడింటి చుట్టూనే పవన్ ప్రదక్షిణలు

488
0

అమరావతి : ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ చివరకు ఉప ప్రాంతీయ పార్టీ నేతగా మిగిలిపోనున్నారా..? జనసేనను ఆంధ్రాలోని ఓ మూలకు నెట్టేస్తున్నారా? పవనే తన పార్టీని ఉత్తరాంధ్రకు పరిమితం చేస్తున్నారా? ఆయన కార్యాచరణ… చేస్తున్న యాత్రలు ఆ ప్రాంతానికే పరిమతం చేయడంలో అర్థం అదేనా? పార్టీలోకి ఇతర పార్టీల్లోని నేతలు… ముఖ్యంగా ప్రజారాజ్యంలోని నేతలను తిరిగి జనసేనలో చేరడం వంటి పరిణామాలను చూస్తే పవన్ కూడా తన అన్న చిరంజీవి దారిలోనే పయనిస్తున్నారన్న చర్చ ఉంది. నిన్నటి వరకు తన పార్టీలోకి పాత కాపులకు స్థానమే లేదంటూ ఘీంకరించిన పవన్… ఇప్పుడు ఏ పార్టీలోనూ టికెట్లు రాని నేతలకు – అన్ని పార్టీలు దూరంగా  పెట్టేసిన నేతలను జనసేనలో కలుపుకుని ముందుకు సాగుతున్నారు. ఆ చోటా మోటా నేతల చేరికలతోనే తాను ఏదో సాధించేసినట్లుగా పవన్ తనదైన శైలిలో డైలాగులు డెలివరీ  చేస్తున్నారు.

అయినా రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సి ఉన్న ప్రజా  చైతన్య యాత్రలో  భాగంగా రెండు నెలల నుంచి పవన్ కేవలం ఉత్తరాంధ్రను కూడా పూర్తి  చేయలేకపోయారు. విడతలవారీగా యాత్ర చేస్తున్న పవన్… ఇప్పటిదాకా మూడు జిల్లాల్లో కాలు మోపగా… ఆ మూడు జిల్లాల పర్యటనను కూడా ఆయన పూర్తి చేయలేదట. ఏదో తనకు తోచినట్లుగా వెళుతున్న పవన్… ఏ ఒక్క జిల్లా యాత్రను కూడా పూర్తి  చేయలేదన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పవన్ అసలు రాష్ట్రం మొత్తం పర్యటిస్తారా?  లేక ఎన్నికలు వచ్చేదాకా ఇదే తరహాలో ఏవో కొన్ని జిల్లాల్లో  మాత్రం పర్యటించేసి… మొత్తం 175 నియోజకవర్గాల్లో  పోటీ అంటూ చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంటారా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

జిల్లాల పర్యటనలు మొదలు పెట్టిన పవన్… శ్రీకాకుళం – విజయనగరం జిల్లాల పర్యటన ముగిసినట్లుగా ప్రకటించారు. అయితే ఆ ప్రకటనకు భిన్నంగా మళ్లీ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించడంలో అంతరార్ధం ఏమిటో తెలియాల్సి ఉంది. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాలో కవర్ కాని ప్రాంతాలను కవర్  చేసేందుకే పవన్ అక్కడికి వచ్చారని అనుకున్నా… మొన్నటిదాకా విశాఖ జిల్లాలో పర్యటించిన ఆయన విశాఖ జిల్లా పర్యటనను పూర్తి  చేసుకోకుండానే శ్రీకాకుళం జిల్లాలో రెండో సారి కాలు పెట్టారు. ఇప్పుడు మళ్లీ విశాఖ జిల్లాలోకి వచ్చేశారు. మొత్తంగా ఎక్కడ చూసినా… ఆ  మూడు జిల్లాల పర్యటనలో స్థానిక సమస్యల కంటే కూడా ఉత్తరాంధ్ర సమస్యలనే పవన్ ప్రస్తావిస్తున్నారు.

దీనిని బట్టి పవన్ కేవలం ఉత్తరాంధ్రకే పరిమితమవుతారా? అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక విశాఖ జిల్లా విషయానికి వస్తే… మొన్న కొందరు నేతలు జనసేనలో చేరారు. వారిలో చాలా మంది అసలు విశాఖ జిల్లాకే కొత్త  ముఖాలు. ఒకరిద్దరు ఓ స్థాయి కలిగిన నేతలే అయినా… మిగిలిన వారంతా ఇతర రాజకీయ పార్టీలు పక్కనపెట్టిన  నేతలుగానే ప్రచారం జరుగుతోంది. ఇక అభ్యర్థుల విషయంలోనూ పవన్ గతంలో చాలా గంభీరమైన ప్రకటనలు చేశారు. తన పార్టీలో అన్నీ కొత్త ముఖాలే ఉంటాయని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అసలు ఎంట్రీ ఇవ్వమని కూడా ఆయన ఘనంగా ప్రకటించారు. అయితే ఇప్పటి  పరిస్థితి చూస్తుంటే… ఇతర పార్టీలు తిరస్కరించిన, ప్రజలు ఓడించిన అభ్యర్థులను మాత్రమే పార్టీలో చేర్చుకుంటూ పవన్ ముందుకు సాగుతున్నారు. ఇక జనసేన సంస్థాగత బలోపేతం విషయానికి వస్తే… ఎప్పుడో తనకు తీరుబడిగా ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తున్న పవన్… పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయలేదనే చెప్పాలి.

పవర్ స్టార్ అభిమానులు తప్పించి ఇప్పటిదాకా పార్టీ ప్రతినిధులం తామేనంటూ బయటకు వచ్చిన వారి సంఖ్యను వేళ్లపై లెక్కపెట్టేయొచ్చు. అయితే పార్టీని పవన్ కల్యాణ్ తన యాత్రలోనే బలోపేతం చేస్తారని – పార్టీలోకి చేరికలు – సంస్థాగత కూర్పు అంతా అప్పుడే రూపుదిద్దుకుంటుందని కూడా జనసేన చెబుతూ  వస్తోంది. అయితే ఈ విషయంలోనూ పవన్  పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పర్యటన సందర్భంగా చంద్రబాబు సర్కారుపై పోరాటానికే పవన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు తప్పించి అక్కడి స్థానిక సమస్యలు, పార్టీలో చేరికలు, ఆయా స్థానాలకు అభ్యర్థుల ప్రకటన తదితరాలన్నీ కూడా ఇసుమంత కూడా కనిపించిన దాఖలా లేదనే చెప్పాలి.