జీవాల పెంపకం దారులకు రుణాలు ఇవ్వాలి

    392
    0

    – జిల్లా సమావేశంలో పెంపకం దారుల డిమాండ్

    – 50 ఏళ్లు దాటిన పెంపకం దారులకు పెన్షన్ ఇవ్వాలి

    – పశువైద్యశాలల్లో శాశ్వత వైద్యులను నియమించాలి

    – అధికారులను నిలదీసిన పెంపకం దారులు

    బాపట్ల : పశువైద్యశాలల్లో శాశ్వత వైద్యులను నియమించి, గొర్రెలు మేకలకు వైద్య సేవలు అందించాలని జీవాల పెంపకం దారులు డిమాండ్ చేశారు. పట్టణంలోని వ్యవసాయ కళాశాల మీటింగ్ హాల్లో మంగళవారం జరిగిన లైవ్ స్టాక్ మిషన్ పధకం శిక్షణా కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గొర్రెలు మేకల పెంపకం దారులు తమ డిమాండ్లను వినిపించారు.

    నిజమైన గొర్రెలు పేకల పెంపకం దారులకు ఇవ్వాల్సిన రుణాలను రొయ్యల చెరువుల పారిశ్రామికవేత్తలకు ఇచ్చారని ఆరోపించారు. నిజమైన గొర్రెలు మేకల పెంపకం దారులు నష్టపోయారని అధికారుల దృష్టికి తెచ్చారు. 50ఏళ్ళు దాటిన జీవాల పెంపకం దారులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. జీవాల పెంపకం దారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. దోమ తెరలు ఇవ్వాలన్నారు. భీమా సౌకర్యం ప్రభుత్వమే కల్పించాలని కోరారు. ఒక్కొక్క పెంపకం దారునికి 100 గొర్రెలను రుణం పై మంజూరు చేసి విత్తన పొట్టేళ్లను ఇవ్వాలని కోరారు. ఒక్కొక్క పెంపకం దారునికి అర్హులైన వారికి రు.5లక్షలు నుండి రు.50లక్షల వరకు రుణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

    సమావేశంలో పశు సంవర్ధక శాఖ జేడీ హనుమంతరావు, ఫిష్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా చైర్మన్ బొట్ల రామారావు, ఫిష్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా చైర్మన్ బూడిద సైదులు, బాపట్ల ఎల్డిఎం శివకృష్ణ, బుర్రి ఆంజనేయులు, చీరాల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కావురి రమణారెడ్డి, గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం నాయకులు మోనపాటి రామకృష్ణ పాల్గొన్నారు.