– జగన్‌కు కస్తూరిభా పాఠశాల చిన్నారుల స్వాగతం
– గుమ్మడి కాయలతో స్వాగతం పలికిన మహిళలు
– పాదయాత్ర బాటలో పూలవర్షం
కనిగిరి : వైఎస్ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర కనిగిరి నగర పంచాయితీలోకి ప్రవేశించింది. హజీస్‌పురంలో ప్రారంభమైన జగన్ పాదయాత్ర కనిగిరి పట్టణానికి చేరుకునేలోపు కంది రైతులతో చర్చించారు. సమీపంలోని కంఠంవారిపల్లె, చినిర్లపాడు, పేరంగుడిపల్లి గ్రామాల ప్రజలతో చర్చించారు. నగరపంచాయితీ సమీపంలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాయలం విద్యార్ధులు వైఎస్ఆర్ అక్షర క్రమంలో కూర్చుని స్వాగతం పలికారు. మహిళలు గుమ్మడి కాయలు పట్టుకుని జగన్‌కు దిష్టితీస్తూ స్వాగతం పలికారు. యాత్ర ముందు వాహనంపై కార్యకర్తలు రోడ్డు పొడవునా పూలు పరిచారు. ఇలా జగన్ పాదయాత్రను పట్టణానికి పండుగలా ఉత్సాహంగా ఆహ్వానించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై జగన్ వెంట అడుగులు కలిపారు.
అధికారులు సీరియస్
జగన్ పాదయాత్రకు కస్తూరిభాగాంధీ బాలికల పాఠశాల విద్యార్ధులను వైఎస్ఆర్ అక్షర క్రమంలో కూర్చోబెట్టడంపై అధికారులు సీరియస్ అయ్యారు. విద్యార్ధులను రాజకీయ పార్టీల యాత్రలకు పంపడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగే యాత్రకు ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులను అధికారికంగా పాఠశాల ఆవరణలో స్వాగత ఏర్పాట్లు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అలా విద్యార్ధులను ప్రోత్సహించిన పాఠశాల ప్రత్యేకాధికారిణి సుజాతకు సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ మెమో ఇచ్చారు.