అమరావతి : ఎన్నికల వేడి ఊపందుకుంటుంది. రాజకీయ వలసలు మొదలయ్యాయి. రాజకీయ భవిష్యత్తు కోసం నేతలు వారికి అనువైన వేదికలు వెతుక్కుంటున్నారు. ఆలస్యమైతే అమృతమైనా విషమటుందన్న చందంగా ముందుగానే సీట్లు రిజర్వు చేసుకుంటున్నారు. కాంగ్రెసులో ఉన్న నేతలు కొందరు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనను ఎంపిక చేసుకున్నారు. తాజాగా మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు తనయుడు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ కు షాక్ ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ జీవం పోసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ కు మరో దెబ్బ తగిలింది. ఉమ్మడి ఏపీ స్పీకర్‌గా వ్యవహరించిన నాదెండ్ల మనోహర్ గురువారం కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఆయన జనసేనలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. గురువారం సాయంత్రం తిరుపతిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరడానికి అన్ని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.