ముంబై : కోరుకున్న అమ్మాయిని కిడ్నాప్ చేసి తెచ్చి ఇస్తానని యువతకు హామీ ఇచ్చి మరో బిజెపి ఎంఎల్ఎ వివాదాల్లో ఇరుకున్నాడు. ముంబై శివార్లలోని ఘట్కోపర్ నియోజకవర్గంలో సోమవారం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. వేడుకలకు మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన యువతతో కొద్దిసేపు ముచ్చటించారు. ఆ సందర్భంగా యువతకేమి కావాలో కోరుకోమని అడిగారు. ప్రేమించిన అమ్మాయిలు కాదంటున్నారని కొందరు యువకులు ఆయనకు బదులిచ్చారు. అందుకు ఎంఎల్ఎ రామ్కదామ్ ఇచ్చిన హామీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘‘మీరు కోరుకున్న అమ్మాయి ఎవరో తల్లిదండ్రులతో నాకు చెప్పించండి. ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే.. కిడ్నాప్ చేయించైనా… తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను’’ అంటూ వారికి హామీ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలను అక్కడున్న యువకులు కొందరు వీడియో తీసి నెట్లో అప్లోడ్ చేశారు. ఇప్పుడది నెట్లో వైరల్గా మారింది.