హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీని హత్య చేసేందుకు కుట్ర పన్నారన్న కేసులో విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరరావును పుణే పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మంగళవారం అరెస్టు చేశారు. ఉదయం నుండి పుణె పోలీసులు వరవరరావుతో పాటు ఆయన కుమార్తెల నివాసాల్లోనూ సోదాలు చేశారు. సోదాలు ముగిశాక వరవరరావును అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షల తర్వాత ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు పుణె తరలిస్తారని తెలుస్తోంది.
మావోయిస్టులు ప్రధాని మోడీని హత్య చేసేందుకు చేసిన కుట్రలో వరవరరావు పేరు ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. మావోయిస్టులు రాసిన లేఖలోనూ వరవరరావు పేరు ఉన్నట్లు పుణె పోలీసులు వరవరరావుపై కేసు నమోదు చేశారు. నిధుల సమీకరణలోనూ వరవరరావు ప్రమేయమున్నట్లు పోలీసుల అనుమానం నేపథ్యంలో పుణె నుంచి హైదరాబాద్‌కు చేరుకుని మంగళవారం తెల్లవారుజామునుండి నాలుగు బృందాలుగా ఏర్పడి సోదాలు చేపట్టారు. వరవరరావుతోపాటు ఆయన కుమార్తెలు, స్నేహితుల నివాసాల్లో సోదాలు చేశారు. సోదాల అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు.
సుమారు ఏడు గంటల పాటు తమను నిర్బంధించి సోదాలు చేశారని వరవరరావు భార్య మీడియాకు తెలిపారు. మావోయిస్టుల లేఖలో ఆయన పేరు ఉన్నందుకే ఇలా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తెల నివాసాల్లోనూ సోదాలు చేసినట్లు ఆలస్యంగా తెలిసిందన్నారు. కనీసం టీవీ చూసే అవకాశం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.