•దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
•‘దివ్యాంగ శక్తి’కి నేడు మంగళగిరిలో సీఎం శ్రీకారం
•ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వెల్లడి
పర్చూరు (DN5 News) : దివ్యాంగుల సంక్షేమం, వారి స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు (MLA Yeluri Samba shiva rao) తెలిపారు. ఆ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) బుధవారం మంగళగిరిలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 11.16 లక్షల మంది దివ్యాంగులు నేరుగా లబ్ధి పొందనుండగా, సహాయకులతో కలిపి 12.76 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. 40శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు ఉన్న పరిమితులను విస్తరించి 4 నుంచి 21 రకాల వైకల్య వర్గాలకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. దివ్యాంగులతో పాటు ప్రయాణించే సహాయకులకు 50 శాతం టికెట్ రాయితీ కల్పించడం ద్వారా వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేశామని తెలిపారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.207 కోట్లు ఆర్టీసీకి చెల్లించనున్నదని వివరించారు.
ఉగాది పండుగ సందర్భంగా దివ్యాంగులకు ఈ పథకం ప్రత్యేక కానుకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ తదితరులు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి, అనంతరం వారితో భోజనం చేసే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే రోజు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. నియోజకవర్గంలో ఉదయం 11 గంటలకు పర్చూరు బస్టాండ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
కూటమి నాయకులు, తెలుగుదేశం శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కావాలని కోరారు. ఇప్పటికే మహిళల కోసం అమలు చేస్తున్న ‘స్త్రీశక్తి’ పథకం విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. ఇప్పటివరకు 52 కోట్లకుపైగా ఉచిత ప్రయాణాలు నమోదై రూ.1826 కోట్ల వ్యయం జరిగినట్లు తెలిపారు. అదే విధంగా ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా దివ్యాంగుల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సిఎం ఇచ్చిన హామీని కేవలం రెండు నెలల్లోనే అమలు చేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి 2026-27 బడ్జెట్‌లో రూ.4,582 కోట్లు కేటాయించడం ద్వారా ప్రభుత్వం వారి సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టమవుతోందని తెలిపారు. దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా ‘దివ్యాంగ శక్తి’ పథకం కీలకంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.






