అమరావతి : పుచ్చలపల్లి సుందరయ్య మరణించి నేటికి 33 ఏళ్ళు. 1985 మే 19వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన జీవించిన కాలమంతా సమాజానికి మార్గదర్శకంగా నిలిచారు. నాటి కాలంలో రాజకీయాల్లో ఒక కొత్త మార్గాన్ని చూపారు. రాజకీయ నాయకుడంటే ఎలా ఉండాలో ఒక నమూనాగా నిలిచారు. భారత దేశంలో దోపిడీ, అసమానతలు లేని సమ సమాజాన్ని నిర్మించాలని కలలు కన్నారు. అందుకోసం తన యావజ్జీవితాన్ని అంకితం చేశారు. సుందరయ్య స్ఫూర్తితో నాడు అనేక మంది సర్వస్వం త్యాగం చేసి ఎర్రజెండా పట్టుకుని రాజకీయ కదనరంగంలోకి దూకారు. ఊరూరా వర్గ పోరాటాలు నిర్మిస్తూ వ్యవసాయ కూలీలను, పేద రైతులను కూడగట్టారు. 1980లలో రాష్ట్రంలో అఖిలపక్ష ఉద్యమాలకు ఆయనే సారథ్యం వహించారు. పారిశ్రామిక వాడల్లో కార్మికులను సంఘటిత పరచడానికి ప్రత్యేక పథక రచన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఒక సమగ్ర ప్రణాళికను రచించారు. స్వాతంత్య్రం తొలి రోజుల్లో విశాలాంధ్రలో ప్రజారాజ్యం నినాదంతో చేసిన ఉద్యమం ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. 1980లలో ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల పథకాల మీద, భూ సమస్య మీద, సోషలిస్టు వ్యవస్థ స్థాపన మీద అనేక పుస్తకాలు వెలు వరించారు. ప్రత్యేకంగా తన చివరి రోజుల్లో నూతన తరంలో నాయకత్వాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక శ్రద్ధపెట్టారు. వారి కోసం శిక్షణా శిబిరాలు నిర్వహిం చారు. ప్రతీ జిల్లాకు తను స్వయంగా హాజరై కార్యకర్త లను ఎంపిక చేసి వారి అభివృద్ధికి చర్యలు సూచిం చారు. సుందరయ్య మరణానంతరం రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమం చచ్చిపోయిందన్న వారికి ఆయన ఈ రూపంలో సమాధానం చెప్పారు. సుందరయ్య తన తరాన్నే కాదు తర్వాత తరాలను కూడా ప్రభావితం చేశారు. తనదంటూ రాజకీయాలపై ఒక ముద్ర వేశారు. ఇలాంటి ఉత్తమ నాయకుడి జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టి రానున్న తరాన్ని అభ్యుదయ పథంలో నడిపించాల్సిన బాధ్యత మనపై ఉంది.
స్వాతంత్య్రానికి ముందు తరువాత తరాలకు మధ్య వారధిగా నిలిచారాయన. స్వాతంత్య్రోద్యమ కాలంలో కాంగ్రెస్‌తో విడగొట్టు కుని సరికొత్త కమ్యూనిస్టు ఉద్యమ సంస్కృతికి ఆయన నాంది పలికారు. గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ అనుసరించిన కొన్ని మంచి లక్షణాలను కొనసాగిస్తూనే నిరాడంబరత్వం, పారదర్శక జీవితం, ప్రజల ముందు నిజాయితీగా ఉండటం, ప్రజలతో కలగలసి పోవటం, ప్రజల కష్ట, సుఖాలను తెలుసుకోవటం, వారి సమస్యలకు పరిష్కారం వెతకటం, నిర్దిష్ట ప్రత్యామ్నాయాల కోసం ప్రజలను కూడగట్టి పోరాటాలు చేయటం ఆయన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయాయి. భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మూలన కోసం అంబేద్కర్ పోరాడినట్లుగానే తన జీవితాన్ని స్వగ్రామంలో కుల వివక్షతపై పోరాటంతో ఆరంభించారు. అలగానిపాడులో దళితులు అత్యధిక భాగం వ్యవసాయ కూలీలు అయినందున వ్యవసాయ కార్మికసంఘం పెట్టి వారిని సంఘటిత పరిచారు. అదే ఆ తరువాత రాష్ట్రం అంతా విస్తరించింది. భూ సమస్య, వేతనాల సమస్య తీసుకొని మిగతా పార్టీలకు కమ్యూనిస్టు పార్టీ ఏ విధంగా భిన్నమైందో చూపించారు. వేతనాల్లో కుల వివక్ష, లింగ వివక్షలను ప్రతి ఘటించారు. ఒక కమ్యూనిస్టు నాయకుడిగా ప్రజల విముక్తి కోసం ఒక భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. వర్గ పోరాటాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను మిళితం చేశారు. ఎక్కడకు వెళ్ళినా అక్కడ పరిస్థితుల్ని నిర్దిష్టంగా అధ్యయనం చేయడం ఆయనకు అలవాటు. ప్రజల జీవితాల గురించిన వివరాల కోసం నాయకుల్ని, కార్యకర్తలను కూడా అలాంటి వివరాల కోసమే నిలదీసేవారు. ఇలాంటి నిర్దిష్ట అధ్యయనం నుంచే పోరాట నినాదాలు ఉద్భవించాయి. చరిత్ర ప్రసిద్ధిగాంచిన తెలంగాణ సాయుధ పోరాటానికి ఆయన స్వయంగా నాయకత్వం వహించారు. ఆ పోరాట అనుభవాలను తరువాత తరాలకు గుణపాఠాలుగా అందించారు. సాయుధ పోరాటాన్ని విరమించి పార్లమెంట్ రంగంలోకి ప్రవేశించి అందులోనూ రాణించారు. పార్లమెంట్‌లో గాని, అసెంబ్లీలో గాని ఆయన ఉపన్యాసాలు అందరి దృష్టిని ఆకర్షించేవి. నాటి ప్రధానమంత్రి నెహ్రూ మొదలుకొని ఆయన ఆఖరి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉన్న చెన్నారెడ్డి వరకూ అందరూ ఆయన అభిప్రాయాలకు ఎంతో విలువనిచ్చేవారు. ప్రతి సమస్యను నిర్దిష్ట సమాచారంతో విశ్లేషించి దానికి అనువైన నిర్దిష్ట పరిష్కారాలను సూచించడమే ఆయన ఉపన్యాసాల రహస్యం. నేటి ప్రజా ప్రతినిధుల్లాగా ఊకదంపుడు ఉపన్యాసాలను ఆయన అసలు ఇష్టపడరు. ఆయనతో పాటు అసెంబ్లీలో సహచరులుగా ఉన్న ఇతర పార్టీల యం.యల్.ఎ.లు సైతం ఇప్పటికీ ఆయన గురించి స్మరించుకుం టూనే ఉంటారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో సుందరయ్య లాంటి నాయకుడు లేని లోటును తీర్చలేమని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రస్తావించారంటేనే ఆయన గొప్పతనం అర్ధం అవుతుంది. వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వారు కూడా రాజకీయ విలువల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా సుందరయ్య పేరునే ప్రస్తావిస్తుంటారు. సుందరయ్య వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది కమ్యూనిస్టు ఉద్యమం. అలాంటి ఉద్యమానికి తిరిగి తన వ్యక్తిత్వం ద్వారా ఆయన వన్నె తెచ్చారు.
నేడు కర్నాటక నడి వీథుల్లో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే సుందరయ్య లాంటి మహోన్నత నాయకులు మనకు మరోసారి గుర్తుకు వస్తారు. 1983లో కాంగ్రెసు రాజకీయ గుత్తాధిపత్యాన్ని దెబ్బకొట్టి కేరళ, బెంగాల్, త్రిపురల సరసన ఆంధ్రపప్రదేశ్ కూడా చేరింది. ఎన్టీర్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా తిరక్క ముందే తెలుగుదేశాన్ని చీల్చి నాడెండ్ల భాస్కరరావుకు అక్రమంగా పట్టం కట్టింది. ప్రజల్ని కూడగట్టి నాటి ఇందిరాగాంధీ నాయకత్వం లోని కేంద్రంపై తిరుగుబాటు చేసి తిరిగి ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడంలో సుందరయ్య ప్రముఖపాత్ర పోషించారు. నేడు అదే బాటలో బిజేపీ అక్రమ పద్ధతుల ద్వారా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి యడ్యూరప్పకు పట్టం కట్టింది. కాంగ్రెసుకు భిన్నమైన పాలన అందిస్తానని వాగ్దానం చేసిన మోడీ దాని కన్నా నాలుగాకులు ఎక్కువే చదివానని నిరూపించుకున్నారు. సుందరయ్య మరణం దేశంలో నూతన ఆర్థిక విధానాల ప్రవేశం దాదాపు ఒకే సమయంలో జరిగాయి.
సోవియట్ పతనం తరువాత సరళీకరణ ఆర్థిక విధానాలు మరింత ఊపందుకున్నాయి. ఆర్థిక వ్యవస్థతో పాటు రాజకీయాలు మారాయి. రాజకీయాలు కూడా ఒక లాభసాటి వ్యాపారంలా మారాయి. ఓటు ఒక సరుకు అయింది. ప్రజల రక్తమాంసాలు పీక్కు తినే శతకోటీశ్వరులు చట్టసభల్లో ప్రవేశించారు. వారికి ప్రజలంటే గౌరవం ఉండదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండరు. ప్రజలను మభ్యపెట్టి మోసపుచ్చడం అనే కళలో ఆరితేరారు. స్వంత సంపాదనకు పెద్దపీట వేస్తారు. రాజకీయ విలువలను పూర్తిగా తుంగలో తొక్కేసారు. ఒకే వ్యక్తి ఒకే సమయంలో నాలుగు పార్టీల టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తాడు. ఏదో ఒక పార్టీ టికెట్‌పై గెలుస్తాడు. గెలిచాక తమ పార్టీ అధికారం లోకి రాకపోతే మరో పార్టీ లోకి దూకేస్తారు. అక్కడ కాంట్రాక్టులు సంపాదించి చేతి నిండా సంపాదిస్తారు. మళ్ళీ ఎన్నికలు వస్తాయనగా గాలివాటం ఎటుందో అంచనా వేసుకుని సంపాదిం చుకున్న డబ్బుతో టిక్కెట్ కొనేస్తారు. షేర్ మార్కెట్‌లో లాగా రాజకీయ మార్కెట్‌లో సలహాలు ఇవ్వడానికి కన్సల్టెన్సీలు వచ్చేసాయి. వారి సలహాలను కొనుక్కుని తమ భవిష్యత్‌ను నిర్దేశించుకుంటారు. కమ్యూనిస్టు ఉద్యమం బలహీన పడడంతో ఇలాంటి రాజకీయాలకే నేడు ఆదరణ లభిస్తోంది. ఇలాంటి రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి మనకు మరల సుందరయ్యలు కావాలి. అలాంటి సుందరయ్యలు మనకు కమ్యూనిస్టు ఉద్యమంలోనే లభిస్తారు.
మోసపూరిత రాజకీయాలకు మోడీ నాందీవాచకం పలికారు. విదేశాలకు సాగిలపడి స్వదేశీ మంత్రం జపించగలరు. అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలకు దేశాన్ని తాకట్టుపెట్టి దేశభక్తి గురించి ఉపన్యాసం ఇవ్వగలరు. అన్నీ వేదాల్లోనే ఉన్నా యంటూ తిరోగమన పాఠాలు చెబుతూ ఉంటారు. వారే మరో వైపు విదేశీ పెట్టుబడుల సాయంతో దేశాన్ని ముందుకు నడిపిస్తా మంటారు. ఈ రకమైన దొంగ నాటకాలు ఆడే కళలో మోడీ ఆరితేరారు. రోజూ రామజపం చేస్తూ ఆడిన మాట తప్పుతుం టారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చకుండానే కొత్త వాగ్ధానాలతో ప్రజలను ముంచెత్తుతున్నారు. మాటల గారడితో మధ్య తరగతిని మభ్యపెట్టగలుగుతున్నారు. పతనమవుతున్న రాజకీయ విలువలకు మోడీ ప్రతీక. ఇలాంటి కుళ్ళిపోయిన రాజకీయ సంస్కృతికి కాంగ్రెస్ దగ్గర ప్రత్యా మ్నాయం లేదు. ఈ విధానాలను దేశంలోకి తీసుకు వచ్చిందే కాంగ్రెస్. అందుకని రాహుల్‌గాంధీ మోడీతో పోటీ పడటానికి ప్రయత్నిస్తున్నారు. తాను హిందువునని చెప్పుకొనడానికి చొక్కాలు విప్పి జంధ్యాలు ప్రదర్శించే దుస్థితికి దిగజారారు. కాంగ్రెస్, బి.జె.పిలు ఒక దానికి ఒకటి ప్రత్యామ్నాయంగా నిలబడినంత కాలం ఈ రాజకీయ వ్యవస్థ మారదు. రాజకీయా ల్లో నూతన విలువలు కోరుకునే వారంతా మరో ప్రత్యామ్నాయం కోసం పోరాడాలి. అదే సోషలిస్టు ప్రత్యామ్నాయం.
సుందరయ్య కోరుకున్న సోషలిస్టు సమాజంలో అసమాన తలకు తావుండదు. అడ్డదారులు తొక్కేవారికి అవకాశం ఉండదు. దోపిడీ చేయడాన్ని అనుమతించరు. ప్రజలందరికి సంపద, ఆదాయాలు పెంచడమే సోషలిస్టు సమాజ ధ్యేయం. కార్పొరేట్లకు కాదు, కష్టపడే వారికి భూమి కావాలి. నాణ్యమైన విద్య ప్రతి కుటుంబానికి ఉచితంగా అందుబాటులోకి రావాలి. ఆరోగ్యం ప్రాథమిక హక్కుగా గుర్తించాలి. ప్రతి ఒక్కరికి చదువుకు తగ్గ ఉద్యోగం, ఉద్యోగానికి తగ్గ వేతనం అమలు చేయాలి. ఉండేందుకు ఇళ్ళు గ్యారంటీ ఉండాలి. రేపటి కోసం ఈ రోజు నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం ఉండకూడదు. ప్రతి పౌరుడికి చీకు, చింతా లేకుండా గుండెలమీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్ర పోగలిగిన జీవితం కావాలి. రేపేమవుతుందో అనే అభద్రతా భావంతో ఉద్రిక్తతలకు గురికాకూడదు. ఇలాంటి ఆదర్శవంతమైన జీవనమే సోషలిజం. అలాంటి సోషలిస్టు వ్యవస్థ కోసం పోరాడటమే సుందరయ్యకు అర్పించే నివాళి.