చీరాల : పట్టణంలోని అర్హులైన పేదలకు నివేశన స్థలాలు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చెప్పారు. మునిసిపల్ ఓపెన్ థియేటర్ ఆవరణలో నివేశన స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ సందర్భాల్లో నివేశన స్థలాల కోసం 6515మంది దరఖాస్తు చేసుకోగా అధికారులు ప్రాధమిక సర్వేలో 2103మందిని అనర్హులుగా తేల్చారని తెలిపారు. మిగిలిన 4412మందిలో అర్హులను గుర్తించేందుకు 135మంది అధికారుల బృందాలు శనివారం ఒక్కరోజు పట్టణంలోని దరఖాస్తు దారులను సర్వే చేస్తారని పేర్కొన్నారు.
కుల, మత, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ధరఖాస్తుదారులు అధికారులు అడిగిన సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. ఈ పాటికె అందరికి గృహనిర్మాణం పథకం ద్వారా 1608మందికి జి+3 పద్దతిలో ఇల్లు నిర్మాణం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతి కూడా ఇచ్చినట్లు చెప్పారు. పేదలకు సైతం స్థలం మంజూరు చేసేందుకు జరుగుతున్న సర్వేలో అధికారులు అడిగిన రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇతర సమాచారం ఇచ్చి సహకరించాలన్నారు. సమావేశంలో మునిసిపల్ చైర్మన్ ఎమ్ రమేష్ బాబు, కమిషనర్ షేక్ ఫజులుల్లా పాల్గొన్నారు.