ఒంగోలు : వడ్డెర్లకు ఆర్ధిక చేయూత ఇవ్వడంతోపాటు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని వైఎస్ఆర్‌సిపి బిసి అధ్యయన కమిటి కన్వనీర్ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 30న ఒంగోలు ఎ1 ఫంక్షన్ హాలులో బిసి అధ్యయన కమిటి ఆధ్వర్యంలో వడ్డెర రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వడ్డెర పెద్దలు, సంఘాల ప్రతినిధులు హాజరై వడ్డెర్ల అభివృద్దికి చేయాల్సిన పనులపై సూచనలు ఇవ్వాలని కోరారు.
వడ్డెర నాయకులు, పెద్దలు ఇచ్చిన సూచనలు, సలహాలను అధినేత వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. బిసి గర్జనలో వడ్డెర్ల అభివృద్దికి ఏం చేస్తారనే కార్యాచరణ జగన్ ప్రకటిస్తారని చెప్పారు. బిసి మహిళల అభివృద్దికి నిర్ధిష్టమైన విధి, విధానాలు చేపట్టేందుకు వైసిపి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అన్ని కోణాల్లో వైఎస్ఆర్‌సిపి బిసి అధ్యయన కమిటి విశ్లేషించి బిసి డిక్లరేషన్‌లో పొందుపరుస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్డెరలకు మైనింగ్, క్వారీల్లో 20శాతం ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. వడ్డెరలు పనుల్లేక వలసలు పోతుంటే పట్టించుకునే పరిస్థితి ప్రభుత్వానికి లేదని ఆరోపించారు.
సమావేశంలో హెచ్బి నర్సయ్య గౌడ్, కర్నాటి ప్రభాకర్, కటారి శంకర్, వల్లెపు మురళి, గుంజి ఏడుకొండలు, బత్తుల ఏడుకొండలు, తన్నీరు నాగేశ్వరరావు, కుంచాల బ్రహ్మయ్య, కుంచాల అశోక్, తన్నీరు ఆంజనేయులు, రేపల్లె ముని, తన్నీరు శివప్రసాద్, పాదర్తి కోటి, బండారు మల్లికార్జునరావు పాల్గొన్నారు.