చీరాల : వరల్డ్ హార్ట్ డే సందర్భంగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్, చీరాల శ్రీకామాక్షి కేర్ హాస్పటల్ ఆధ్వర్యంలో గుండె జబ్బులపై కామాక్షి హాస్పిటల్ ఆవరణలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా హాజరైన వారికి ఉచిత కన్సల్టేషన్, ఈసీజీ పరీక్షలు చేశారు. సదస్సును ఐఎంఏ ప్రెసిడెంట్, సరస్వతి హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి ప్రసాద్ ప్రారంభించారు. సదస్సులో డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ ధూమపానం మానేస్తే గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చన్నారు. మద్యం సేవించ కూడదన్నారు. ప్రతి ఒక్కరు ప్రతి రోజూ కనీసం గంట పాటు వ్యాయామం చేయాలన్నారు. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి గుండె పరీక్షను చేపించుకోవాలని పేర్కొన్నారు. ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంతంగా జీవితం గడపాలని చెప్పారు. మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు.
శ్రీకామాక్షి కేర్ హాస్పటల్ వైద్యులు డాక్టర్ గడ్డం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్యాస్ నొప్పికి, గుండె నొప్పికి తేడాను గుర్తించే పద్దతిని వివరించారు. నడిచేటప్పుడు ఆయాసం వచ్చినా, మెట్లు ఎక్కేటప్పుడు అలుపు వచ్చినా, గుండె దగ్గర నొప్పితో పాటు చెమటలుపట్టిన పట్టినా, గొంతు నొప్పి, ఎడమ చేయి జాలు మొదలైన పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా ఈసీజీ పరీక్ష చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకామాక్షి కెర్ హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ డాక్టర్ రమేష్ గత 18 సంవత్సరాలుగా చీరాల, పరిసర ప్రాంత ప్రజలకు కార్డియాలజీ సేవలు అందిస్తున్నారని చెప్పారు. చీరాల ప్రజల తరఫున రమేష్ హాస్పటల్ అధినేత డాక్టర్ రమేష్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మౌలాలికి ధన్యవాదాలు తెలిపారు. గ్యాస్ నొప్పి లేదా గుండె నొప్పి తెలుసుకోవడానికి ఓపీతో సంబంధం లేకుండా కేవలం రూ.100లతో ఇసిజి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇఎన్‌టి స్పెషలిస్ట్ డాక్టర్ పలుకూరు సురేష్, తాడివలస కుమార్, సురేష్, రమేష్ హాస్పటల్ మేనేజర్ నూరుల్లా పాల్గొన్నారు.