విజయవాడ : ఎగ్జిట్ పోల్ సర్వేల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ది అందెవేసిన చెయ్యి. ఆయన సర్వే చేస్తే ఫలితం పక్కాగా వస్తుందనే నమ్మకం. అందుకే ఆయన పేరుతో ఆయనకు తెలియకుండా అనేక సర్వేలు వస్తుంటాయి. ప్రస్తుతం అలాంటిదే ఒక సర్వే తెలంగాణలో వైరల్ అయింది. దీంతో లగడపాటి నేరుగా మీడియా ముందుకు వచ్చారు. కొన్ని రోజులుగా తెలంగాణ, ఏపీలో రానున్న ఎన్నికల్లో వీరే విజీతాలు అంటూ రెండు రోజుల నుండి ఓ సర్వే వెల్లడించిన విషయాలు వైరల్ గా మారాయి.
ఆ సర్వే మాజీ ఎంపీ లగడపాటి రాజ్ గోపాల్ చేయించారనే ప్రచారం కూడా జరిగింది. అయితే లగడపాటి ఈ సర్వేలను ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సర్వేలపై స్పష్టత ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు.
ప్రస్తుతం తానెలాంటి సర్వే చేయించలేదన్నారు. ఆ సర్వే ఫలితాలకు, తనకు సంబంధం లేదని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలై, నామినేషన్ల ప్రక్రియ తర్వాతే జననాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తానన్నారు. అప్పడే సర్వే ఫలితాలను ప్రకటిస్తామన్నారు. అప్పటి వరకూ తన పేరిట ఏ ప్రచారం జరిగినా.. అవి కేవలం వేరొకరి కల్పితాలేనని చెప్పారు. తన సర్వే ఫలితాలను తానే స్వయంగా చెబుతానన్నారు.