– ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు
– నిందితుడిని పట్టిచ్చిన వారికి నగదు బహుమతి ఇస్తామని ప్రకటన
– ప్రత్యేక బృంధాలతో గాలిస్తున్న పోలీసులు
– నిలకడగా బాలిక ఆరోగ్యం
అమరావతి : గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. ఒకవైపు నింధితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆందోళనలతో దాచేపల్లి అట్టుడికింది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అరాచకాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిందితుడిని పట్టిచ్చినవారికి నగదు బహుమతి ఇస్తామని పేర్కొన్నారు. వెంటనే దాచేపల్లికి వెళ్లి బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా మంత్రులు, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ను ఆదేశించారు. మరోవైపు బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకూ అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందోళన నిర్వహించారు. ఆందోళనతో దాదాపు 15 కిలోమీటర్లకుపైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనను నిరసిస్తూ దాచేపల్లిలో స్థానికులు స్వచ్ఛంద బంద్ పాటిస్తున్నారు. నిందితుడి ఇంటిని గ్రామస్థులు ధ్వంసం చేశారు. ముద్దాయిని అరెస్టు చేయాలని జీజీహెచ్ ఎదుట ప్రజా, మహిళా సంఘాలు ఆందోళన చేశాయి. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ సీపీఐ, సీపీఎంతోపాటు మహిళా, ప్రజాసంఘాలు నినాదాలు చేశాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినచర్యలు చేపట్టాలని కోరారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అత్యాచారానికి గురైన బాలికను వైద్యచికిత్సల నిమిత్తం గుంటూరు సర్వజనాస్పత్రిలో చేర్చించారు. బాధిత బాలికను జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పరామర్శించి బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యసదుపాయం కల్పించాలని డాక్టర్లను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇలాంటి ఘటన దురదృష్ణకరమన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోక్సో చట్టం కింద చిన్నారి కుటుంబానికి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఐసీడీఎస్, డీఆర్డీఏ, విద్య, మెప్మా వంటి అన్నిశాఖల అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి గ్రామగ్రామాన చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.