కొండేపి : వైఎస్ఆర్‌సిపి కొండేపి నియోజకవర్గ నేత వరికూటి అశోక్‌బాబు వైఎస్ జగన్ పాదయాత్రకు సంఘీబావంగా జనంవెంట కలిసి నియోజకవర్గ పాదయాత్ర నిర్వహించారు. ఆరు మండలాల నాయకత్వం, జనంతో ఉత్సాహంగా పాదయాత్ర నిర్వహించారు. రెండో పాదయాత్రను టంగుటూరు మండలంలో నిర్వహించారు. జమ్ములపాలెం, జయవరం, ఉప్పలపాడు గ్రామాల మీదుగా యాత్ర నిర్వహించారు. అభిమాన నేతకు జనం పూలతొ స్వాగతం పలికారు. హారతులు ఇచ్చారు. పెద్ద సంఖ్యలో హాజరైన జనంతో అశోక్‌బాబు యాత్ర ఉత్సాహంగా కనిపించింది. పార్టీలో ఏర్పడ్డ సంక్షోభంతో ఇన్‌ఛార్జి పదవితోపాటు పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ జనం మాత్రం అశోక్‌బాబు వెంటనే ఉన్నారు. పార్టీ ఇన్‌ఛార్జిగా నియమితులైన డాక్టర్ వెంకటయ్యమాత్రం ఎక్కడా కనిపించలేదు.
అధినేత వైఎస్ జగన్ మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో సంఘీబావ యాత్రలను నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు నిర్వహిస్తున్నారు. కొండేపిలో మాత్రం వైఎస్ఆర్‌సిపి రాజకీయాలు వేడెక్కాయి. పార్టీ అధిష్టానానికి ఉన్న బలంతో ఇన్‌ఛార్జీ పదవినైతే వేరొకరికి ఇవ్వగలిగారు తప్ప జనంలో తన నేతగా ప్రతిష్ట నిలబెట్టుకున్న అశోక్‌బాబు వెంటనే పార్టీ గ్రామ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు నిలవడంతో పార్టీ అధినాయత్వం సందిగ్దంలో పడింది. పార్టీ ఇన్‌ఛార్జిగా నియమితులైన డాక్టర్ వెంకయ్య సారధ్యంలో కొత్త స్థానిక కమిటీలను వేసి మరో తప్పు చేసేందుకు పార్టీ నాయక్తం సిద్దమైంది. అదే జరిగితే కొండేపి నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సిపి రెండుగా చీలిపోయే ప్రమాదం ఉంది. ఈ చీలికలో జనం మాత్రం అశోక్‌బాబు వెంట ఉండగా డాక్టర్ వెంకయ్య వెంట మాత్రం నేతలను ప్రసన్నం చేసుకునే కొందిమంది మాత్రమే పరిమితమయ్యారని వైసిపి నేతలే చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న స్థానిక కమిటీలు రద్దు చేసి కొత్త కమిటీలు వేయనున్నట్లు ప్రకటించారు. ఈనేపద్యంలో నియోజకవర్గంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది.