ఢిల్లీ : మూడు దేశాల పర్యటన ముగించుకొని మన దేశ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు పొద్దున్నే తన సహాయకులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని సింగపూర్ నుంచే ఆదేశించారు. ఆదివారం నాడు ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటూ కాళ్లీడ్చుకుంటూ అందరూ వచ్చారు. ఎప్పుడూ లేనిది నాలుగో సంవత్సరంలో ఇదేమిటి అని ఎవరికి వారే ముఖా ముఖాలు చూసుకుంటున్నారు.
సమావేశం ప్రారంభం కాగానే జనం మన నాలుగేండ్ల పాలన గురించి ఏమనుకుంటున్నారు అంటూ గడ్డం నిమురుకుంటూ అందరివైపు చూశారు ప్రధాని నరేంద్రమోడీ.టీచర్ రాగానే గుడ్‌మార్నింగ్ సార్ అని తరగతి గదిలో పిల్లలు అన్నట్లుగా ఏం చెబితే ఏం ముంచుకొస్తుందో అని అందరూ ఒక్కసారిగా అంతా మంచిగా చెప్పుకుంటున్నారు సార్ అన్నారు. తన దగ్గర ఏదో దాస్తున్నారని పెద్దసార్‌కు అర్ధమైంది. అప్పుడే బయటి నుంచి వచ్చిన అమిత్ షా ఇది విని ముసి ముసిగా నవ్వుకుంటూ తాను కూడా గడ్డం నిమురు కుంటూ వేరే గదిలో కూర్చుంటా అంటూ చిరునవ్వుతో సైగ చేసి వెళ్లిపోయారు. ప్రధాని జరిపే సమీక్ష అంతా అక్కడికి కూడా వినిపిస్తుంది, కనిపిస్తుంది.
కర్ణాటక, వుప ఎన్నికల వంటి రాజకీయ, ఇతర అంశాలు మినహా మిగతా విషయాల గురించి ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పండి. అంటూ ప్రధాని అన్ని వైపులా చూశారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మోడీ గారే మన మన్‌కీ బాత్‌ను మన దూరదర్శన్, రేడియోలు తప్ప మిగతా మీడియా పెద్ద పట్టించుకోవటం లేదని విన్నాను, నేను ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టటం లేదని ఇంకా జర్నలిస్టులు ఏడుస్తూనే వున్నారా, ఆపారా ?
ఒక అధికారి: అది, ఇది….. కొంతమంది దేశభక్తులు మాట్లాడటం లేదు సార్, కొంత మంది దేశద్రోహులు గొణుగుతూనే వున్నారు సార్ ! అయినా సార్ మీరు ఒక సారి ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టి వారి నోరు మూయిస్తే బా…గుం….టుం…దే….మో…. సార్ ! ఒకటి మాత్రం నిజం సార్, మన పాకేజ్‌లు కుదుర్చుకున్న వారు మాత్రం మన గురించి మంచిగా చెప్పటం తప్ప పొరపాటున కూడా ప్రధాని, ప్రెన్ కాన్ఫరెన్సు అని మాత్రం అనటం లేదు సార్, ఇది మాత్రం కచ్చితంగా చెప్పగలను.
ప్రధాని: రాజకీయాలు, ఇతర అంశాలు వద్దంటే అర్ధం ప్యాకేజ్‌లు, కోబ్రాపోస్టు స్టింగ్ ఆపరేషన్ల గురించి చెప్పమనా, షటప్, ప్రెస్ కాన్ఫరెన్సూ, ప్రెస్ కాన్ఫరెన్సూ మీ క్కూడా ఈ పిచ్చి పట్టిందా ఏమిటి? ఇన్నేండ్లు కాంగ్రెస్, ఇతర ప్రధానులు ప్రెస్‌కాన్ఫరెన్సులు పెట్టి సాధించేదేమిటి? నేను సాధించలేనిది ఏమిటీ ! అలాంటివేమీ లేకుండానే ఎన్నో సాధించాం కదా ! ప్రధాని ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టాలని రాజ్యాంగంలో ఎక్కడైనా రాశారా? అయినా అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఏమిటయ్యా, దాన్ని పెడితే ఏమౌతుంది?
మరొక అధికారి: సార్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఏమిటో నేను కచ్చితంగా చెప్పలేను సార్, నేను చాలా చోట్ల చూశాను వచ్చిన వారికి సమోసాలు, స్వీట్ల వంటి శ్నాక్స్, కాఫీనో, టీయో ఏదో ఒకటి పోయాలి తప్ప ఫలానేదే పెట్టాలి, పోయాలి అనెక్కడా నిబంధనలు అయితే లేవు సార్‌్, నాలుగేండ్ల నుంచి మన ఆఫీసు వాటిని ఏర్పాటు చేయలేదు గనుక మర్చిపోయాం, గతంలో ఏమి జరిగిందో ఒకసారి పాత ఫైల్సు తిరగేసి చూస్తే తెలుస్తుంది సార్. ఒక వేళ మనం గనుక ప్రెస్‌కాన్ఫరెన్సు పెడితే పక్కా జాతీయవాదుల మాదిరిగా వుండాలి తప్ప దుష్ట కాంగ్రెస్ మాదిరి మాత్రం కాకూడదు, అయితే సార్ నాకు తెలిసినంత వరకు ప్రెస్ కాన్ఫరెన్సు పెడితే ఆడామగా విలేకర్లు చాలా మంది వస్తారు, రకరకాల ప్రశ్నలు అడుగుతారని అనుకుంటున్నాను సార్.
ప్రధాని: ప్రశ్నలా ! ఎలాంటి ప్రశ్నలేస్తారయ్యా ! ఈ రోజు ఏ వారం, ఇప్పుడు టైమెంత, రాత్రిబాగా నిద్రపట్టిందా? ఈ కోటు ఏ పర్యటనలో వేసుకున్నారు, ఏ విదేశీ పర్యటనలో ఎవరిని హగ్ చేసుకున్నారు, ఎవరికి షేక్ హాండ్ ఇచ్చారు, ఐపిఎల్ చెన్నయ్ సూపర్ కింగ్స్‌లో కుర్రాళ్లెవరూ లేకపోయినా ఎలా గెలిచారు, ఇలాంటివేనా !
ఒక సీనియర్ అధికారి: అలాంటివి అడిగితే అంతకంటే కావాల్సిందేముంది సార్, వాళ్లకేమి పోయే కాలం వచ్చిందో, కొద్ది నెలల్లో రిటైర్ కాబోతున్నా, అనేక ప్రెస్ కాన్ఫరెన్సులు ఏర్పాటు చేశా, ఒక్క చోటా అలాంటి ప్రశ్నలు అడగలేదు. చాలా వికారం పుట్టించే, పరమ మోటుగా వుండే పెట్రోలు, డీజిల్ ధరలు అంతగా ఎందుకు పెరిగాయి, వాటి గురించి గతంలో మీరేం చెప్పారు, ఇప్పుడేం చేస్తున్నారు. వుద్యోగాలు, నల్లధనం సంగతి ఏమైంది, ఎదుటి పార్టీల నుంచి ఆకర్షించటంలో మీకు ఇతరులకు తేడా లేకుండా ఎందుకు పోయింది వంటి చెత్త ప్రశ్నలన్నీ అడుగుతారు సార్ !
ప్రధాని: చెత్తో, చెదారమో ఏదైనా మనల్నెందుకు అడగాలయ్యా? గతంలో ప్రధానులందరినీ ఇలాంటివి అడిగారా ఎప్పుడైనా. ఎవరయ్యా మన్‌కీబాత్ చూస్తున్న అధికారి, ఏవయ్యా మనం ప్రతినెలా మన్‌కీబాత్‌లో ప్రతి ప్రశ్నకు, ప్రతి అంశానికి సంబంధించి చెబుతున్నామా లేదా ( చెబుతున్నాం సార్, ఎవరూ అడగని విషయాలు కూడా చెబుతున్నాం సార్) మనం కాదు, నేను చెబుతున్నాను. పనికి మాలిన ప్రతి చెత్త వెధవా విలేకర్ల ముసుగులో నన్ను ప్రశ్నలడగటానికి వుత్సాహపడేవారే, ముందు అసలు వారు నా మన్‌కీ బాత్ వింటున్నారా? ముందు రేడియో విని నేనేం చెబుతున్నదీ ముందు రాసుకోమనండి. మన్‌కీ బాత్ గురించి రాతపరీక్ష పెట్టి పాసైన వారికే అక్రిడిటేషన్లివ్వండి సగం గొడవ పోద్ది. ఆ మధ్య ఆర్నాబ్ గోస్వామి, మరికొంత మంది మాదిరి ముందుగానే ప్రశ్నలు పంపితే వాటికి సమాధానాలు చెబుతాంగా . అయినా నాకు తెలియక అడుగుతాను ప్రెస్‌కాన్ఫరెన్సులో అయినా నేను చెప్పిందే కదా వారు రాసుకోవాల్సిందీ, విలేకర్లయినా, మరొకరైనా, చివరికి మా పార్టీ వారైనా నేను చెప్పింది వినటం, రాసుకోవటమే కదా చేయాల్సింది, డిక్టేట్ చేయటమే నాపని, అందువలన ఎవరైనా నన్ను పెద్ద డిక్టేటర్ అనుకున్నా నాకు ఆశ్చర్యం లేదు, అస్సలు ఖాతరు చేయను.
గుజరాతీ అధికారి: మీరు ఎంత గొప్పగా డిక్టేట్ చేస్తారో, గుజరాత్ ముఖ్యమంత్రిగా, నాలుగేండ్లుగా ప్రధానిగా నేను చూస్తున్నా, ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టకుండా పారిపోతున్నారు లేదా తప్పించుకుంటున్నారు అని గొణుక్కుంటున్నారే తప్ప విలేకర్లరెవరూ ఇప్పటి వరకు మిమ్మల్ని డిక్టేటర్ అనలేదు, ఎందుకంటే వారు మీరు ఇంత వరకు ముఖాముఖీ ఒక్కసారి కూడా కూర్చోలేదు. మీ డిక్టేషన్ ఎలా వుంటుందో వారికి అసలు తెలియదు. కనుక డిక్టేటర్ అన్నా ఆశ్చర్యపడను, ఖాతరు చేయను అని మీ అంతట మీరు అన వద్దు సార్! గోరక్షకుల గురించి, గోమూత్ర పరిశోధనలకు డబ్బెంత తగలేస్తున్నారు, మీరు చెప్పిన మంచి రోజులు ఇంకా ఎంత దూరంలో వున్నాయి, గుజరాత్ మోడల్‌ను దేశమంతటా ఎందుకు విస్తరింపచేయలేదు, నల్లధనం రప్పించటం ఎంతవరకు వచ్చింది వంటి పనికిమాలిన ప్రశ్నలైతే అడుగుతారు. వారు అడగకుండా మనకు పంపినా మన దగ్గర వాటికి సంతృప్తికరమైన సమాధానం కూడా లేదు సార్!
ప్రధాని: సరే ఈ విలేకర్ల గోల ఎప్పుడూ వుండేదే ప్రతి గొట్టాం గాడు ముందుకు వచ్చి బోనులో నిలబెట్టినట్లు అడిగేవాడే. ఎవరైనా ఇంకోసారి గనుక ప్రధాని, ప్రెస్‌కాన్ఫరెన్సు అని అడిగితే సారు మళ్లీ గెలిచిన తరువాత తప్పకుండా పెడతాను అని చెప్పమన్నారు అని చెప్పండి. చెప్పింది వినకుండా ఎవరైనా సతాయిస్తూ ఎక్కువా తక్కువా మాట్లాడితే అలాంటి వారందరినీ ఏదో ఒక పేరుతో ఒక గదిలో పెట్టి బయటకు పోనివ్వకుండా పాత మన్‌కీ బాత్‌లన్నీ వినిపించండి. దూలతీరిపోద్ది, పెన్నూ, నోట్‌బుక్, కెమెరా, గొట్టం(మైకు) ప్రతి వాడికీ ఈ మధ్య ఇదొక ఫాషనై పోయింది. ప్రధాని అంటే అంత పనీ పాటా లేకుండా వున్నాడనుకుంటున్నారా ?