చీరాల : కేంద్ర ప్రభుత్వం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (ఐఎంసి) ను రద్దు చేసి దాని స్థానంలో జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసి) పేరుతో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బిల్లు అమలైతే దేశంలో వైద్యవృత్తి సంక్షోభంలో పడుతుందని ఐఎంఎ అధ్యక్షులు పోలవరపు వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. ఐఎంఎ పిలుపు మేరకు చీరాల పట్టణంలోని ప్రవేటు వైద్యశాలల్లోని వైద్యులు శనివారం ఒక్కరోజు బంద్ చేశారు. ఉదయం 6నుండి సాయంత్రం 6వరకు ఒపి నిలిపేశారు. అత్యవసర వైద్యసేవలు మాత్రమే అందించారు. డాక్టర్లు ఐఎంఎ హాలునుండి తహశీల్దారు కార్యాలయం వరకు చేరుకున్నారు. అనంతరం తహశీల్దారు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
ఈసందర్భంగా ఐఎంఎ అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ నూతన వైద్యవిధాన బిల్లు లోపభూయిష్టంగా ఉందన్నారు. దీనిపై నిపుణులైన వైద్యబృంధం 24సవరణలు చేశారని చెప్పారు. వీటిల్లో ఒక్క అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారని చెప్పారు. దానివల్ల ప్రయోజనం ఉందడన్నారు. గతంలో ఉన్న ఇండియన్ మెడికల్ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉండేదన్నారు. అన్ని రాష్ట్రాల్లో వైద్య పరిస్థితులపై చర్చించేవారని చెప్పారు. ఎన్‌టిఆర్ మెడికల్ విశ్వవిద్యాయం, కాలోజి నారాయణరావు మెడికల్ విశ్వవిద్యాలయం, ఎంజిఆర్ మెడికల్ విశ్వవిద్యాలయం వంటివి సిలబస్‌ను నిర్ణయించి పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. అలాంటి వైద్యులు అందరూ ఇప్పుడు కేంద్రం నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికే వైద్యవృత్తి చేసుకునే అవకాశం ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్టుపేరుతో కార్పోరేట్ తరహా సౌకర్యాలు ఉండాలని చెప్పడం వైద్యవృత్తినే నమ్ముని మానవతా దృక్పధంతో వైద్యం చేసేవారికి సాధ్యం కాదన్నారు. కేంద్రం నూతనంగా తీసుకొస్తున్న ఎన్ఎంసిలో 29మంది కమిటి సభ్యులుగా ఉంటారని చెప్పారు. వీరిలో కేవలం ఐదుగురే డాక్టర్లు ఉంటారని మిగిలిన వాళ్లంతా మంత్రులు, ప్రజాప్రతినిధులే ఉంటే వైద్యవృత్తిలో వచ్చే మార్పులను ఎలా అధ్యయనం చేస్తారని ప్రశ్నించారు. రొటేషన్ పద్దతిలో ఐదుగురు డాక్టర్లలో ఒక్కొక్క రాష్ట్రానికి 10ఏళ్లకు ఒకసారి ప్రాతినిధ్యం వస్తుందన్నారు. ఇలాంటి పద్దతులు ప్రజాస్వామ్యానికి, పెడరల్ వ్యవస్థకు విరుద్దమైనవన్నారు.
డాక్టర్ వరికూటి అమృతపాణి మాట్లాడుతూ పిచ్చితుగ్లక్ పాలన పుస్తకాల్లో చదువుకున్నామని, ఇప్పుడు మోడీ పాలనలో చూస్తున్నామని అన్నారు. అర్ధరాత్రి నిద్రలేచేసరికి నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి వాటితోపాటు వైద్యవృత్తితో సంబంధంలేని వారితో వైద్యవృత్తి కౌన్సిల్‌ను నింపడం వంటివి చేయడం నియంతృత్వ పోకడలని పేర్కొన్నారు. నూతన వైద్యవిధాన బిల్లును రద్దుచేసి పాతపద్దతిలోనే ఐఎంసిని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, డాక్టర్ రామకృష్ణ హనుమాన్, డాక్టర్ ఐ బాబురావు, డాక్టర్ ఎస్ కొండలరావు, డాక్టర్ పేట శ్రీకాంత్, డాక్టర్ జి పున్నారావు, డాక్టర్ సూర్యదేవర ఉమామోహన్, డాక్టర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.