డిల్లీ : ఆర్ఎస్ఎస్ మళ్లీ రామమందిరాన్ని తెరపైకి తెచ్చింది. అయోధ్యలో సత్వరం రామ మందిరం నిర్మాణంతోనే హిందువులు, ముస్లింల మధ్య ఉద్రిక్తతలకు చరమగీతం పడుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ‘ఇమామ్-ఇ-హింద్’ గా ఆయన రాముడిని పోల్చారు. కొంత మందికి రాముడు దేవుడు కాకపోయినప్పటికీ భారతీయ విలువలకు ఆయన ప్రతిరూపమని చెప్పారు. ‘భవిష్య భారత్- ఆర్‌ఎస్‌ఎస్ దృక్కోణం’ అంశంపై డిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసిన మూడు రోజుల సమ్మేళనం ముగింపు సందర్భంగా ఆయన వివిధ అంశాలపై వ్రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సామరస్యంగా మందిరం నిర్మాణమైతే ముస్లింలపై ఎవరూ వేలెత్తి చూపలేరన్నారు. రామ మందిర సమితి చేతిలోనే తుది నిర్ణయం ఉంటుందన్నారు. మందిర నిర్మాణంపై చర్చలకు ఆయన మద్దతు ఇచ్చారు.
రిజర్వేషన్లపై భగవత్…
ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్ కోటా విధానానికి భగవత్ పూర్తి మద్దతు ప్రకటించారు. సామాజిక అసమానతలను రూపుమాపేందుకు రాజ్యాంగంలో కల్పించిన అవకాశమే రిజర్వేషన్లన్నారు. ఎసీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్నీ సమర్థించారు. అయితే ఈ చట్టం దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. ఇప్పుడున్న కుల వ్యవస్థను తాము అంగీకరించమన్నారు. కులాంతర వివాహాలకూ సానుకూలమేనని చెప్పారు. గోరక్షణ పాటించాలని కోరారు. అయితే గోరక్షణ పేరుతో చట్టవ్యతిరేక పనులకు పాల్పడకూడదన్నారు. మూకదాడి ఘటనలపై ఆయన స్పందించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని చెప్పారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు.
జమ్ము, కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాకు వ్యతిరేకం
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగంలోని 370, 35-ఏ అధికరణలకు ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకమని భగవత్ చెప్పారు. అక్కడి ప్రజలను ప్రధాన జనజీవన స్రవంతిలో కలిపేందుకు పెద్దెత్తున అభివృద్ది కార్యక్రమాలు చేయాలన్నారు. దేశంలో జనాభా నియంత్రణపై ఒక విధానం రూపొందించాలని ఆయన చెప్పారు. మహిళలకు సరైన రక్షణ కల్పించాల్సి ఉందన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు.