చీరాల : ప్రాధమిక ఆరోగ్య కేంద్రంపై నమ్మకం ఉంటేనే రోగులు వస్తారని, అలాంటి నమ్మకం కలిగించాల్సిన బాధ్యత పిహెచ్‌సి సిబ్బందిపై ఉందని ఎంపిపి గవిని శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పిహెచ్‌సిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం పరిసర గ్రామాల్లో 104వాహనం పర్యటించి గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారికి వైద్యపరీక్షలు చేయాలని సూచించారు. బాలింతల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. మారిన వాతావరణ పరిస్థితుల్లో విషజ్వరాలు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సిబ్బందికి సూచించారు. అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. ఆయన వెంట మండల కోఆప్షన్ షేక్ మస్తాన్, పంచాయితీ వార్డు సభ్యులు గంజి పురుషోత్తం, మాజీ ఎంపిటిసి పృథ్వీ ధనుంజయ, ఎరిచర్ల స్వామిదాసు పాల్గొన్నారు.