Home ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు అభివృద్ధి మార్క్… ఎపిలో ప్రాజెక్టుల స్థాపనకు అనిల్ అంబానీ సై

చంద్రబాబు అభివృద్ధి మార్క్… ఎపిలో ప్రాజెక్టుల స్థాపనకు అనిల్ అంబానీ సై

356
0

అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పరపతి ఏమిటో చూపారు. సోమవారం రిలయన్స్ దిగ్గజం అనిల్ అంబానీ విజయవాడ వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగానే భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంపై తమకున్న ఆసక్తిని వెల్లడించారు. చంద్రబాబు తో భేటీలోనే రిలయన్స్‌ గ్రూపు చైర్మన్‌ అనిల్‌ అంబానీ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. త్వరలో పిలిచే టెండర్లలో తాము కూడా పాల్గొంటామని అంబానీ చెప్పినట్లు సమాచారం. వాస్తవానికి ఈ విమానాశ్రయం నిర్మాణానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని ఎక్కువగా ఇస్తామని చెప్పింది. ఆ తర్వాత పనులు చేపట్టడంలో జాప్యం చేస్తూ వచ్చింది. ఆపై ఎయిర్‌పోర్టును నిర్మించలేమని చెప్పేసింది. దీంతో ఈ సంస్థను నిర్మాణ బాధ్యతల నుంచి తప్పిస్తూ భోగాపురం ఎయిర్‌పోర్టు కార్పొరేషన్‌ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ప్రఖ్యాత సంస్థలేమైనా ముందుకు వస్తాయేమోనని రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఇలాంటి తరుణంలో సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబుతో రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ సమావేశమయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టేందుకు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. విశాఖ జిల్లా రాంబిల్లిలో రూ.5వేల కోట్ల పెట్టుబడులతో నావల్‌ షిప్‌బిల్డింగ్‌కు సంబంధించి 2వేల ఎకరాలు కేటాయించాలని అంబానీ కోరారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని అనిల్‌ పేర్కొన్నట్లు సమాచారం.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 4వేల మెగావాట్ల అల్ట్రా పవర్ ప్రాజెక్టుపై ఇక ముందుకెళ్లలేమని అంబానీ నిస్సహాయత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల సామర్లకోటలోని రిలయన్స్‌ ఎనర్జీ 220మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల గడువు ముగియడంతో వాటిని డిస్కమ్‌లు రద్దు చేసుకున్నాయి. ఈ అంశమూ భేటీలో చర్చకు వచ్చింది. పీపీఏల కాలపరిమితి ముగియడంతో రద్దు నోటీసును ఇప్పటికే జారీ చేశామని ఏపీ జెన్కో ఎండీ విజయానంద్‌ వివరించారు. ఇక భోగాపురం ప్రాజెక్టుపై అంబానీ ఆసక్తి వ్యక్తం చేయడం ఆంధ్ర ప్రదేశ్ కి మంచి ఊపు తీసుకురానుంది.

ఇప్పటి వరకు విశాఖ పారిశ్రామిక సదస్సులు… విదేశీ పర్యటనలు ద్వారా పరిశ్రామికులను ఆకట్టుకునేందుకు ఎపి ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ఇప్పుడు అనిల్ అంబానీ వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఇలా రాష్ట్రంపై ఆసక్తి వ్యక్తికరించడం రాష్ట్ర ప్రగతికి సోపానం కానుంది. ప్రస్తుతం బీజేపీతో తెగదెంపులు చేసుకుని టీడీపీ ప్రభుత్వం సొంతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న సంకల్పం నేపథ్యంలో ఇదో పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఏపీ ఎలా ఎదుగుతుందో చూస్తాం అనే బీజేపీ నేతలకు ఈ పరిణామ ఊహించని షాక్ కానుంది.