ఆధునికి జీవన విధానం, కాలుష్యం, ఎలా పడితే అలా, ఏదిపడితే అది తినడం, చెడు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాటిలో మలబద్ధక సమస్య ఇటీవల ఎక్కువ మందిలో పెరుగుతుంది. మలబద్ధక సమస్య ఉన్న వాళ్లకు విసర్జన చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమస్యతో బాధపడేవారు వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే మల విసర్జనకి వెళ్తారు. వింటర్ సీజన్‌లో అయితే మలబద్ధక సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.
వీరికి మలం చాలా గట్టిగా ఉంటుంది. కడుపు సరిగ్గా క్లీన్ అవ్వదు. మలబద్ధకం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. కడుపు ఉబ్బరం, పొట్ట నొప్పి, పుల్లటి తేన్పులు, వికారం వంటి సమస్యలు రావచ్చు. మలబద్ధకం సమస్యను అధిగమించడానికి చాలా మంది మందులు వాడతారు. ఇంటి చిట్కాలు పాటిస్తారు. వీటన్నింటికన్నా పురాతన పద్ధతి ఒకటి ఉంది. దానితో మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు. దీనినే ఆక్యుప్రెషర్ టెక్నిక్. శరీరంలో కొన్ని ప్రెజర్ పాయింట్లు నొక్కడం ద్వారా మలబద్ధక సమస్య తగ్గించుకోవచ్చు.
ఈ టెక్నిక్ గురించి చాలా మంది వినే ఉంటారు. శరీరంలో కొన్ని ప్రెజర్ పాయింట్లు నొక్కడం ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి పరిష్కారం పొందవచ్చు. కండరాల నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలకు చక్కటి పరిష్కారం. ఈ పద్దతి మన దేశంలో ఉపయోగిస్తున్నప్పటికీ చైనా, జపాన్, థాయిలాండ్ దేశాల్లో ఇది బాగా పాపులర్. ఇప్పటికీ ఈ పద్ధతిని అక్కడి ప్రజలు వినియోగిస్తున్నారు.
మలబద్ధకంతో బాధపపడేవాళ్లకు ఆక్యుప్రెషర్ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. టాయిలెట్‌కు వెళ్లే ముందు మోచేతి పైన అంటే ఎగువ భాగంలో 16 నుంచి 18 సార్లు నొక్కాలి. క్రమ క్రమంగా ఒత్తిడి కలిగించాలి. అలా చేసేటప్పుడు నొప్పి అనిపించవచ్చు. కానీ అలా చేయడం వల్ల పొట్టలో అసౌకర్యం తగ్గుతుంది. మలబద్ధక సమస్య నుంచి రిలీఫ్ లభిస్తుంది. రోజూ ఈ టెక్నిక్ పాటిస్తే జీర్ణ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మోచేతి పైన నొక్కితే పొట్టలో అసౌకర్యం నుంచి ఎలా ఉపశమనం లభిస్తుందన్న అనుమానం రావచ్చు. జీర్ణక్రియ, కడుపుకు సంబంధించిన నాడులు మోచేతి దగ్గర ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే వాటిని నొక్కడం వల్ల నాడులు ఒత్తిడికి గురై స్టిమ్యులేట్ అవుతున్నాయి. దీంతో మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో మరికొన్ని చోట్లపై ఒత్తిడి చేస్తే జీర్ణ వ్యవస్థ మెరగవుతుంది.
హెగు : ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ చేతి వెనుక భాగంలో బొటన వేలు, చూపుడు వేలు మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు నెమ్మదిగా ఒత్తాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
కిహై : ఈ పాయింట్ నాభికి సుమారు ఒకటిన్నర అంగుళాల క్రింద ఉంటుంది. ఈ పాయింట్‌ను ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు నెమ్మదిగా ఒత్తాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరగవుతుంది. మలబద్ధక సమస్య తగ్గిపోతుంది.
జుసాన్లీ : ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ మోకాలి దిగువన సుమారు మూడు అంగుళాల కింద ఉంటుంది. ఈ పాయింట్‌పై నెమ్మదిగా రెండు నిమిషాలు ప్రెషర్ పెట్టాలి. ఇలా చేయడం వల్ల మలబద్ధక సమస్య, కడుపు సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.
నిపుణుల దగ్గర కొన్ని రోజుల శిక్షణ తీసుకుని ఆ తర్వాత ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నొప్పి అనిపించినప్పటికీ ప్రతి పాయింట్‌ను ఉత్తేజపరిచేందుకు ఒత్తిడి తీవ్రత క్రమంగా పెంచుకోవాలి. ఆక్యుప్రెషర్ పాయింట్ల మీద మసాజ్ చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మీరే మసాజ్ చేసుకోవచ్చు. లేదంటే వేరే వారి సాయం తీసుకోవచ్చు.
గమనిక : ఇది సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, నిపుణుల సూచనలు మాత్రమే అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించేముందు సంబంధిత వైద్యులను సంప్రదించడం మంచిది. అలాగే ఆరోగ్యవంతమైన జీవన విధానం, సరైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు.