చీరాల : వైఎస్ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ 109వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ఆదివారం ఉదయం చర్చి కాంపౌండ్ నుండి ప్రారంభమైంది. యాత్ర ప్రారంభం నుండి జనం జగన్ వెంట అడుగులు కలిపారు. ఈసందర్భంగా రామకృష్ణాపురంకు చెందిన ఆరేళ్ల చిన్నారి గుంటుపల్లి నాగశ్రీలత అనే బాలిక తన కిడ్డీ బ్యాంకులో రెండేళ్లుగా దాచుకున్న నగదును జగన్‌కు అందజేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఓరుగంటి రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సమస్యలపై జగన్‌కు వినతి పత్రం అందజేశారు. తోటవారిపాలెం ఎత్తిపోతల పథకం పరిధిలోని రైతులు కొత్తపేటలో వినతి పత్రం అందజేశారు.
బాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు సమీపంలో న్యాయవాదులు జగన్‌ను కలిసి సమస్యలు వివరించారు. ఇలా అడుగడుగునా జనం జగన్‌కు సమస్యలు వివరించారు. పూలతో స్వాగతం పలికారు. కొత్తపేట, విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల, కోర్టు, బాలాజీ ధియేటర్, పేరాల చిన్నరదం సెంటర్, కారంచేడు గేటు సెంటర్, మసీదు సెంటర్ మీదుగా ఐఎల్‌టిడి కంపెనీ వరకు చేరుకున్నారు. మద్యాహ్న విరామం అనంతరం ఆదినారాయణపురం మీదుగా ఈపూరుపాలెం చేరుకున్నారు. ఈపూరుపాలెంలో బిసిల సదస్సు నిర్వహించారు. యాత్రలో వైసిపి జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి, బాపట్ల పార్లమెంటు ఇన్‌ఛార్జి మోపిదేవి వెంకటరమణ, సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్‌బాబు, వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ యడం బాలాజీ, డాక్టర్ వరికూటి అమృతపాణి పాల్గొన్నారు.