చీరాల : నిత్యం వివిధ సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రజల సమస్యలు పరిష్కరించేందకే ప్రజావేదిక కార్యక్రమం చెప్పినట్లు ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాల తహశీల్దారు కార్యాలయం ఆవరణలో శనివారం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. అధికారుల సమన్వయ లోపంతో ప్రభుత్వ కార్యాలయాలకు అర్జీలు పట్టుకుని ప్రజలు తిరుగుతున్నారన్నారు. భవిష్యత్తులో అర్జీల సంఖ్య తగ్గితేనే ప్రజావేదిక ప్రయోజనం నెరవేరినట్లని పేర్కొన్నారు. సభలో 313మంది వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. సభలో మున్సిపల్ ఛైర్మన్ మోదడుగు రమేష్‌బాబు, టిడిపి మండల అధ్యక్షులు బుర్ల మురళి, తహశీల్లారు ఎం వెంకటేశ్వర్లు, ఎంపిడిఒ వెంకటేశ్వర్లు, ఇఒఆర్‌డి బి రమేష్ పాల్గొన్నారు.
ఒకవైపు వైసిపి అధినేత వైఎస్ జగన్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. యాత్రకు వైసిపి నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. వేటపాలెం నుండి చీరాల, ఈపూరుపాలెం వరకు వైసిపి ప్లెక్సీలతో నింపేశారు. అదే స్థాయిలో ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ తాను చేపట్టిన ప్రజావేదిక ప్రభుత్వ అధికారిక కార్యక్రమం పేరుతో వేటపాలెం నుండి ఈపూరుపాలెం వరకు జగన్ పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ పాదయాత్ర మద్యలో ఆమంచి ప్లెక్సీలు కనిపించడం పట్టణంలో రాజకీయ చర్చకు దారితీసింది. గడియార స్థంభం సెంటర్‌లో ఎటు చూసినా వైసిపి ప్లెక్సీలతోపాటు ఆమంచి ప్లెక్సీలు కనిపించాయి. జగన్ బహిరంగ సభ వాహనం గడియార స్థంభం కూడలిలో ఎక్కడ నిలిపినా జగన్ మీడియా కవరేజిలో ఆమంచి ప్లెక్సీలు కనిపిస్తుండటంతో బస్సు నిలిపే ప్రాంతాన్నే మార్చారు. పాత విశ్వేశ్వర హోటల్ స్థానంలో నిలిపి సభ నిర్వహించారు.