Home ప్రకాశం చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి : వడ్డెర సంఘ నేతలు జగన్‌ దృష్టికి తీసుకెళ్తామన్న...

చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి : వడ్డెర సంఘ నేతలు జగన్‌ దృష్టికి తీసుకెళ్తామన్న వైఎస్సార్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ రాష్ట్ర కన్విననర్‌ జంగా కృష్ణమూర్తి

628
0

ఒంగోలు : “54 శాతంగా ఉన్న బీసీల్లో యాదవుల తర్వాత అతి పెద్ద సామాజికవర్గం మాది. కానీ జనాభాకు తగ్గట్టు చట్ట సభల్లో మా ప్రాతినిధ్యం లేదు. కనీసం వైఎస్సార్‌సీపీలోనైనా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి.” అంటూ వడ్డెర సంఘ నేతలు వైఎస్సార్ సీపీ ని కోరారు. ఆదివారం ఒంగోలు ఏ1 కన్వెన్షన్‌ హాల్లో వైఎస్సార్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వడ్డెరల సదస్సు నిర్వహించారు. సదస్సుకు కన్వీనర్‌ జంగా కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. సదస్సులో కృష్ణమూర్తి మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటినా శ్రమను నమ్ముకున్న వడ్డెరల జీవితాల్లో ఆశించిన అభివృద్ధి జరగలేదన్నారు. నేటికీ సగం మంది సంచార జీవితాలు గడపడం శోచనీయమన్నారు. టీడీపీ ప్రభుత్వం వడ్డెరలకు మైనింగ్‌, క్వారీల్లో 10శాతం కేటాయిస్తామని హామీ ఇచ్చినప్పటికి నెరవేర్చకుండా మోసం చేసిందని విమర్శించారు.

బీసీల్లోని అల్పసంఖ్యాక వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు జగన్‌ ముందుకొచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ, నామినేటెడ్‌ పదవులు ఇచ్చి పాలనలో వాళ్లకు భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. బీసీల్లోని అన్ని కులాల అభివృద్ధి కోసం అధ్యయన కమిటీ వేసి తద్వారా వాళ్ల సమస్యలు తెలుసుకునేందుకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఆయా కుల పెద్దలు, నాయకులు సదస్సుల్లో తమ సూచనలు వెల్లడిస్తున్నట్లు తెలిపారు. వడ్డెరల సమస్యలపై అధ్యయనం చేసిన అనంతరం బీసీ డిక్లరేషన్‌లో వాళ్ల అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలను పొందుపరుస్తామని చెప్పారు. బీసీల అభివృద్ధికి జగన్‌ చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు వివరించారు.

సదస్సులో వడ్డెర ఉద్యోగుల సంఘ నేతలు కుంచాల కోటయ్య, కె. కోటేశ్వరమ్మ, వడ్డెర సంక్షేమ సంఘం నేత తన్నీరు సుబ్బారావు, విజయవాడ నుంచి తమ్మిశెట్టి చక్రవర్తి, గుంటూరు నుంచి డి మల్లికార్జున్‌, నెల్లూరు నుంచి గుంజి నరసింహారావు, బెల్లంకొండ శ్రీనివాసరావు, కడప నుంచి కే జీవానందం, ఎస్సీఎస్టీ లేబర్‌ సొసైటీల అధ్యక్షులు కె లవకుమార్‌, కుంచాల మంగ, డేరంగుల ఆంజనేయులు పలు సూచనలు చేశారు. రాత పూర్వకంగా వినతి పత్రాలు సమర్పించారు. ఇంకా మాజీమంత్రివర్యులు హెచ్‌బీ నర్సన్న గౌడ్‌, మాజీ డీఐజీ చంద్రగిరి ఏసురత్నం, వడ్డే గోపాలకృష్ణ, అధ్యయన కమిటీ సభ్యులు చిమటా సాంబు, తొండమళ్ల పుల్లయ్య, వల్లెపు వర ప్రసాద్‌, అంగిరేకుల ఆదిశేషు, బీసీ సెల్‌ కేంద్ర కార్యాలయ బాధ్యులు కర్నాటి ప్రభాకర్‌, ఎన్‌ ముని, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్‌, నగర అధ్యక్షులు పాదర్తి కోటి పాల్గొన్నారు.

వడ్డెర నేతలు సూచించిన ముఖ్య సూచనలు…
– ఎస్సీల్లో చేర్చడమా.. లేక ఎస్టీల్లో చేర్చడమా అనే ముందు కమిషన్‌ వేసి వడ్డెరల జీవితాలపై చట్టబద్దంగా అధ్యయనం చేయించాలి.
– గనులు, క్వారీలు 75శాతం వడ్డెరలకు ఇవ్వాలి.
– యంత్ర సామగ్రి, పెట్టుబడి కోసం ఒక్కొక్కరికి రూ.2 కోట్ల రుణమివ్వాలి.
– ఫెడరేషన్‌ రద్దు చేసి కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందించాలి.
– ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకోవడానికి అకాడమీ ఆఫ్‌ కనస్ట్రక్షన్‌ ఏర్పాటు చేయాలి.
– పనుల్లేని సమయంలో కనీసం 15రోజుల వేతనం ఇచ్చే గ్యారెంటీ స్కీంను అమలు చేయాలి.
– ప్రతి జిల్లా, మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో ఆరామ క్షేత్రాలు ఏర్పాటు.
– రాజధానిలో వడ్డెర భవనానికి ఓ ఎకరం ఇవ్వాలి.
– 7నుంచి డిగ్రీ వరకూ ఉచితంగా చదువు అందించేందుకు ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్లలో ప్రత్యేక విద్యాలయాలు నెలకొల్పాలి.
– శాసన సభ, శాసనమండలిలో ప్రాతినిధ్యం కల్పించాలి.