Home ప్రకాశం బిసిల రాజకీయ, ఆర్థిక బలోపేతానికి తోడ్పాటునివ్వాలి : వైఎస్సార్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ సదస్సులో వక్తలు

బిసిల రాజకీయ, ఆర్థిక బలోపేతానికి తోడ్పాటునివ్వాలి : వైఎస్సార్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ సదస్సులో వక్తలు

551
0

ఒంగోలు : ”జనాభాలో 55 శాతం ఉన్నాం. రెండు, మూడు శాతం కూడాలేని సామాజిక వర్గాల వారిని ముఖ్యమంత్రులు, మంత్రులుగా చేస్తున్నాం. కానీ మా వెనుకబాటుతనం అలాగే ఉంది సార్‌. ఇది మారాలి. బీసీల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. ప్రాధాన్యమివ్వాల్సిందే” అంటూ సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం మహిళా నాయకురాలు దుర్గంపాటి పద్మజ ఆవేదన వ్యక్తం చేశారు.

”విద్య, ఉపాధి రంగాల్లో బీసీ మహిళలు వెనుకబడి ఉన్నారు. బడుగు మహిళల ఎదుగుదలకు వైఎస్సార్‌సీపీ ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి.” అంటూ ధనలక్ష్మి సూచించారు. ఇలా 146 బీసీ కులాలకు చెందిన అనేకమంది వక్తలు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు తెలిపారు. బుధవారం ఏ1 ఫంక్షన్‌ హాల్లో వైఎస్సార్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ సదస్సు జరిగింది. సదస్సుకు కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ జంగా కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. సదస్సులో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్‌ హాజరయ్యారు.

రాజకీయాలకు అతీతంగా బీసీల్లోని వివిధ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వక్తలు పలు సూచనలు చేశారు. బీసీల్లో ఎంబీసీలుగా వర్గీకరింపబడిన 37 సంచార జాతుల వారి గురించి ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎమ్మెల్యే, మంత్రి పదవులు అడగడం లేదని, కనీసం స్థానిక సంస్థల్లోనైనా ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. లక్షలు.. కోట్లు అడగడం లేదు. మనిషిగా బతకడానికి అవకాశం కల్పించేందుకు వైఎస్సార్‌సీపీ దోహదపడాలని కోరారు. సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం నేత లీలా కృష్ణ మాట్లాడుతూ విద్య, ఉపాధి రంగాల్లోనే కాకుండా ఎస్సీ, ఎస్టీల మాదిరిగా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు, విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు బీసీలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కుమ్మరులు వినియోగించే మట్టికి సంబంధించిన భూములు ఆక్రమణ పాలయ్యాయి. వాటిని తిరిగి కుమ్మరులకు ఇప్పించాలని శాలివాహన సంఘం నేత ఎం సుబ్బారావు సూచించారు. ప్రత్యేక కార్పొరేషన్‌ ద్వారా బ్యాంకుతో లింకు లేని రుణాలు ఇవ్వాలని యాదవ, వడ్డెర, ఉప్పర, రజక కులాలకు చెందిన నేతలు అంగిరేకుల ఆదిశేషు, బొట్ల రామారావు, తన్నీరు ఆంజనేయులు, జూటూరి శ్రీనివాస్‌, చల్లా మాలకొండయ్య కోరారు.

అలాగే చట్టసభల్లో తక్కువ సంఖ్యలో ఉన్న కులాలకు మండలి ద్వారా ప్రాతినిధ్యం కల్పించాలని సూర్య బలిజ సంఘం నేత సూర్య ప్రకాశరావు కోరారు. పద్మశాలీల సంఘ నేతలు సీహెచ్‌ అశోక్‌, గోలి తిరుపతిరావు, నూర్‌బాషా దూదేకుల సంఘం నుంచి ఎస్‌కే అజీజ్‌, వాల్మీకి బోయ సంఘం నుంచి ఎం. శ్రీనివాస్‌, ముదిరాజ్‌ సంఘం నుంచి నాగయ్య, నాయీ బ్రాహ్మణ సంఘం నుంచి వల్లూరి కోటేశ్వరరావు, రజక సంఘం నుంచి శ్రీదేవి, పలు సూచనలు చేశారు.

సదస్సులో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌, జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేదని విమర్శించారు. టీడీపీ ఓటు బ్యాంకుగానే బీసీలను పరిగణిస్తుందని ఆరోపించారు. బీసీల అభ్యున్నతి కేవలం వైఎస్సార్‌ కాంగ్రెస్‌తోనే సాధ్యమని వివరించారు.