చీరాల : ఐడిఎ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ప్రశంసాపత్రాలు అందజేశారు. నోటి ఆరోగ్యం, దంతాల ఆరోగ్యం ముఖ్యమని పలువురు దంతవైద్యులు పేర్కొన్నారు. నోటి ఆరోగ్యం వలన అన్ని విధాలా ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చునన్నారు. పళ్ళ చుట్టూ ఉన్న చిగుళ్ళు మీ పళ్ళను కదలకుండా ఉంచడానికి తోడ్పడతాయన్నారు. మీ చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి నోటి పరిశుభ్రత పాటించాలన్నారు. కనీసం రోజుకి రెండు సార్లైనా పళ్ళు తోముకోవాలని సూచించారు. రోజుకి ఒకసారైనా ఫ్లాస్సింగ్ చేసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా దంత వైద్యులను సంప్రదించాలని సూచించారు. చిగుళ్ళు వాచి ఎర్రగా మారినా, చిగుళ్ళ నుండి రక్తం స్రవిస్తున్నా అవి ఇన్ ఫెక్షన్‌కు గురి కావచ్చునని, సత్వర చికిత్స నోటి ఆరోగ్యాన్ని పునరుధ్ధరించడానికి సహాయ పడుతుందన్నారు.
నోటి ఆరోగ్యం కొరకు బ్రషింగ్
నోటి ఆరోగ్యం పరిశుభ్రమైన దంతాలతో మొదలౌతుందన్నారు. పళ్ళు తోముకోడానికి ముఖ్యమైన సూత్రాలు వివరించారు. దంతాలను కనీసం రోజుకు రెండు సార్లు, హడావిడి పడకుండా నిదానంగా పళ్ళను తోముకోవాలని సూచించారు. సరైన టూత్ బ్రష్‌ను, టూత్ పేస్టును వాడాలని చెప్పారు. ఫ్లొరైడ్ టూత్ పేస్టును, మెత్తటి టూత్ బ్రష్ వాడాలన్నారు. సరైన టెక్నిక్ ప్రాక్టీస్ చేయాలని సూచించారు. పళ్ళ మీద బ్రష్‌ను కొంచెం ఏటవాలుగా పెట్టుకోవాలన్నారు. కొద్ది దూరం ముందుకీ వెనక్కీ కదుపుతూ బ్రష్ చేయాలని చెప్పారు. పళ్ళ లోపలి వైపూ, పైనా, నాలుక మీదా బ్రష్ చేయడం మరచిపోకూడదన్నారు. ప్రతి మూడు నెలలకి ఒక కొత్త టూత్ బ్రష్ మార్చాలన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకూ యోగ్యతా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ పులిగడ్డ శ్యామ్ సుందర్, శ్రీదేవి, వేణు గోపాలరావు, హనుమంతరావు, రవితేజ, శశికుమార్, ప్రధానోపాధ్యాయులు ఎస్ ఇందిరా ఇజ్రాయేల్, తులసీరామ్, గవిని నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, మస్తాన్ రావు, ఎస్‌డిజి ఖురేషి, నీలిమ, భాను పాల్గొన్నారు.