అమరావతి : తెలంగాణలో టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు సిద్దమయ్యారు. కెసిఆర్ నిర్ణయంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలతోపాటు ఆంద్ర రాజకీయాలపైనా ప్రభావం చూపుతుందా? అసలు ముందస్తు వ్యూహం ఎవ్వరిదీ? ఎలాంటి వివాదం లేకుండానే కెసిఆర్ ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారు. ఎన్నికల కమీషన్ ఎలా ఆమోదించింది? ఎవరి రాజకీయ ఉచ్చులో ఎవరు పడుతున్నారు? అన్నీ ప్రశ్నలే. టిఆర్ఎస్‌లో సీటు రానివాళ్లు కొత్తదారులు వెతుక్కోక తప్పడంలేదు. అక్కడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియదు. టిఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతాయా? ప‌్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, టిడిపి, సిపిఎం, సిపిఐ, కోదండరామ్, బిజెపి, ఎంఐఎం వంటి పార్టీల పొత్తులు ఎలా సాధ్యం. వీటిలో ఏ రెండు పార్టీలకు చారిత్రకంగా ఏకాభిప్రాయానికి వచ్చే నేపధ్యం లేదు. పొత్తులు నాయకత్వ స్థాయిలో కుదిరినా గ్రామస్థాయిలో కలయిక సాధ్యమా?
జాతీయ రాజకీయాల్లో కర్నాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకోవడం కేంద్రంలో బిజెపి, మోడీ పాలనపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా ఉంది. వీటితోపాటు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ బిజెపికి చుక్కెదురే అయ్యింది. దీంతో జాతీయ స్థాయిలో ఒకేసారి ఎన్నికలు జరిగితే ఓటర్లు కాంగ్రెస్‌కు మొగ్గు చూపితే బిజెపికి భంగపాటు తప్పదు. అందుకే కాంగ్రెస్‌ను ఓడింగచగలిగిన మిత్రులను ముందస్తుకు పంపితే ఎలా ఉంటుందన్న కేంద్రంలోని మోడీ వ్యూహ్యంపై చర్చనీయాంశమైంది. తెలంగాణాలో కాంగ్రెస్‌కు గెలిచే బలం లేకపోవడం, ప్రతిపక్ష పార్టీలన్నీ ఎవరికి వారుగానే ఉండటం టిఆర్ఎస్‌కు కలిసి వచ్చే అంశంమే. అయితే మోడీ వ్యూహంపై అమిత్‌షా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలొస్తున్నాయి. తెలంగాణాను ఇచ్చిన కాంగ్రెస్‌నే మోసం చేసిన కెసిఆర్‌ను ఎలా నమ్మాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు చర్చజరుగుతుంది. ఏది ఏమైనా ముందస్తు ఎన్నికల శగ ఆంద్రాకు తాకనుంది.
వైరంతో పుట్టిన పార్టీలు ఇప్పుడు కలిసి ప్రయాణం చేయాల్సిన రాజకీయ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ వ్యతిరేక పుదనాదులపై పుట్టిన పార్టీ టిడిపి. ఇప్పుడు ఈరెండూ పొత్తపై సానుకూలంగా ఉన్నట్లు చర్చ జరుగుతుంది. కాంగ్రెస్, బిజెపి, టిడిపి, టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నయంగా వామపక్ష, దళిత పార్టీలతో సిపిఎం నాయకత్వంలో ఆవిర్భవించిన బిఎల్ఎఫ్ 119స్థానాలకు పోటీసి సిద్దమని ఫ్రంట్ కన్వీనర్ ఈపాటికే ప్రపకటించారు. కోదండరాం తెలంగాణ ఆవిర్భావ లక్ష్యాల పేరుతో కెసిఆర్‌కు వ్యతిరేకంగా వెళుతున్నారు. మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎంఐఎం కర్ణాటక రాజకీయాలను ఆదర్శంగా తీసుకోవాలని కార్యకర్తలను రెచ్చగొట్టింది. అక్కడ కుమారస్వామి ముఖ్యమంత్రి అవ్వంగాలేనిది ఇక్కడ ఎంఐఎం ఎందుకు ముఖ్యమంత్రి కాలేదని కార్యకర్తలను ప్రశ్నించి అందుకు తగ్గట్లుగా ఎంఐఎం అభ్యర్ధులను గెలిపించాలని ఒవైసి సంకేతాలు ఇచ్చారు. ఈ నేపధ్యంలో ఎవరెవరి మద్య పొత్తులు కుదురుతాయి? 119స్థానాల్లో ఎవరెన్ని సాధించుకుంని అధికార పీఠం ఎక్కుతారనేది ఇప్పుడు ప్రశ్నార్ధకమైంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను వంటరి చేయడం, ప్రాంతీయ పార్టీల ప్రభావాన్ని తగ్గించాలనే మోడీ ఎత్తుగడ ఇక్కడ ఏమవుతందో వేచి చూడాల్సిందే.