చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో అలింబిక్ ఫార్మాసూటికల్స్ కంపెనీ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఎంబిఎ, బి ఫార్మసీ విద్యార్ధులు 9మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు తెలిపారు. ఆగష్టు 28, 29తేదీలలో ప్రాంగణ ఎంపికలునిర్వహించారు. ముంబాయి ప్రధాన కేంద్రంగా 110సంవత్సరాలుగా ఫార్మా రంగంలో ప్రసిద్ది చెందిన అలింబిక్ ఫార్మాసూటికల్స్ కంపెనీకి ఎంపికవడం అభినందనీయమని ప్రిన్సిపాల్ డాక్టర్ పొగడదండ రవికుమార్ పేర్కొన్నారు.
తొలుత కంపెనీ ఆవిర్భావం, ఉత్పత్తి కేంద్రాలు, కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, ఎంపికైన విద్యార్ధులకు ఉండవలసిన లక్షణాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎంపికలకు 70మంది విద్యార్ధులు హాజరు కాగా 21మంది ఇంటర్వూలకు ఎంపికైనట్లు ఎంపికల అధికారి ఎన్ పూర్ణచంద్రరావు తెలిపారు. వీరిలో 9మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్ధులకు సంవత్సరానికి రూ.2.50లక్షల వేతనం, ఇతర అలవెన్సులు ఇస్తారని తెలిపారు. ఎంపికైన విద్యార్ధులను ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ వివి నాగేశ్వరరావు, ఎంబిఎ హెచ్ఒడి డాక్టర్ ఆర్ ఇమ్మానియేల్ అభినందించారు.