చీరాల : బాపట్ల పార్లమెంటు ఇన్‌ఛార్జిగా డాక్టర్ వరికూటి అమృతపాణి, కొండపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా వరికూటి అశోక్‌బాబు ఇద్దరు సోదరులు గత నాలుగేళ్లుగా పార్టీని సజీవంగా నిలబెట్టి అనేక ఆటుపోట్లను తట్టుకుని నిలబెడితే ఇప్పడు తన సామాజికవర్గం ముందుకొచ్చిందని ఇద్దరినీ పక్కనపెట్టేందుకు వైసిపి అధినేత వైఎస్ జగన్ సిద్దమవటం దుర్మార్గమైన ఆలోచనని దళిత, ప్రజాసంఘాల నేతలు ఆరోపించారు. ప్రకాశం జిల్లా చీరాల డ్రైనేజీ అతిధి గృహంలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. చీరాల, కొండేపి నియోజకవర్గాల్లో జరుగుతున్న తీరుపై స్పందించారు. బాపట్ల పార్లమెంటు సభ్యునిగా గత ఎన్నికల్లో పోటీ చేసి కోట్లరూపాయలు ఖర్చుచేసి తీవ్రంగా నష్టపోయినప్పటికీ నాలుగేళ్లుగా పార్టీని నియోజకవర్గంలో నిలబెట్టారని చెప్పారు.
జగన్ ప్రజాసంకల్పయాత్ర జిల్లాకు వచ్చిన సందర్భంలో కందుకూరులో వరికూటి బ్రధర్స్‌తో చర్చించి ఇద్దరిలో ఒకరికే పోటీ చేసే అవకాశం ఇవ్వగలం, ఎవ్వరో తేల్చుకోవాలని చెప్పిన సందర్భంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ అమృతపాణి తాను పోటీనుండి తప్పుకుంటూ తన సోదరుడు అశోక్‌బాబుకు కొండేపిలో అవకాశం ఇవ్వాలని తన స్థానం త్యాగం చేశారని దళిత ప్రజాచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గోసాల ఆశీర్వాదం పేర్కొన్నారు. ఇప్పడు కొండేపి నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, గ్రామపార్టీల అధ్యక్షులు, పోలింగ్ బూతుస్తాయిలో ఉన్నవాళ్లుసైతం అశోక్‌బాబు కావాలంటుంటే కేవలం రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు అశోక్‌బాబును వ్యతిరేకిస్తున్నారనే సాకుచూపి పక్కనపెట్టాలనుకునే నిర్ణయం తీసుకోవడం మాటతప్పని, మడం తిప్పని జగన్ వంటి నేతలకు మంచిది కాదని హెచ్చరించారు. వాడుకుని వదిలేసే పద్దతి పాటించేపనైతే ఇన్నేళ్లు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న దళిత సామాజికవర్గాల ప్రజలు కూడా ఆలోచిస్తారని చెప్పారు. సమావేశంలో ఎరుకల హక్కుల సంఘం అధ్యక్షులు ఎన్ఎం ధర్మ, కుంచాల పుల్లయ్య, కెవిపిఎస్ అధ్యక్షులు లింగం జయరాజు, కౌన్సిలర్ పొదిలి ఐస్వామి, సంగుల జాన్‌చిరంజీవి, పేర్లి నాని, గోసాల అశోక్, యాతం క్రాంతికుమార్, జనరాజుపల్లి మోషె, పులుగు కృష్ణారెడ్డి, హరిజల్లు అప్పన్న పాల్గొన్నారు.