Home ప్రకాశం ఆ సినిమాలకు ఇక సెలవు : కా౹౹ మాదాల రంగారావుకు జోహార్

ఆ సినిమాలకు ఇక సెలవు : కా౹౹ మాదాల రంగారావుకు జోహార్

603
0

హైదరాబాద్ : సామాజిక స్పృహ, విప్లవాత్మక సందేశంతో సినిమాలు తీసి, ప్రజల్లో చైతన్యాన్ని రగుల్కొల్పడానికి అంకితభావంతో పిడికిలి బిగించి పోరుసల్పిన సినీ నటుడు, నిర్మాత మాదాల రంగారావు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన లేరన్న వార్త విషాదాన్ని నింపింది.

విద్యార్థి దశలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్(ఎ.ఐ.ఎస్.ఎఫ్.) ద్వారా మార్క్సిజం భావజాలం వైపు ఆకర్షితుడైన మాదాల శ్రామిక ప్రజలను చైతన్య పరచి, సంఘటిత పరచి, ఉద్యమ బాట పట్టేలా చేయడానికి కళా రంగాన్ని, ప్రత్యేకించి సినీ రంగాన్ని ఎంచుకొన్నారు. మొక్కవోని ధైర్యంతో మడమతిప్పని పట్టుదలతో, ఆర్థిక ఇబ్బందులను సహితం లెక్క చేయకుండా ప్రగతిశీల, అభ్యుదయ, విప్లవాత్మక సందేశాలతో సినిమాలు తీశారు. శ్రామిక జనావళే కాదు, ప్రజల హృదయాలలో శాశ్వత స్థానాన్ని కల్పించుకొన్నారు. తెలుగు సినీ రంగంలో నూతన వరవడి సృష్టించారు. తనకంటూ చెరగని ముద్ర వేశారు.

కమ్యూనిస్టు, కార్మికోద్యమాలకు అండగా నిలవడమే కాదు, సినిమాల ద్వారా ఆర్జింజిన ధనంలో అత్యధిక భాగాన్ని వెనకా ముందు ఆలోచించకుండా విరాళాలు ఇచ్చి శ్రామిక ప్రజాపోరాటాలను ప్రోత్సహించారు. తాను మాత్రం ఆర్థికంగా చితికిపోయారు.

మాదాల ముఖంలో ఏనాడు అధైర్యం, అపనమ్మకం, అవిధేయత కనపడ లేదు. ఆయనలో పట్టు సడల లేదు. మార్క్సిజం పట్ల విశ్వాసం సన్నగిల్ల లేదు.

కమ్యూనిస్టు ఉద్యమంలో చీలిక పర్యవసానంగా వివిధ పార్టీలుగా మనుగడ సాగిస్తున్నా కా౹౹ మాదాల రంగారావును అందరి వాడుగానే చూశారు. అభిమానించారు. ఆయన కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత కోసం, బలహీనతల నుండి బయటపడి బలోపేతం కావాలని పరితపించారు.

నిష్కపటి, తాను నమ్మిన కమ్యూనిస్టు భావజాలం పట్ల అచంచల విశ్వాసంతో జీవించి, మరణించిన కా౹౹ మాదాల రంగారావు మృతికి ప్రగాఢ సంతాపాన్ని, వారి కుమారుడు డా౹౹ మాదాల రవి, ఇతర కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాము.
కా౹౹ మాదాల రంగారావు ధన్యజీవి. జోహార్… కా౹౹ మాదాల రంగారావు…