అమరావతి : మార్చి 15నుండి 29వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్ధినీ విద్యార్ధులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు తెలుసుకోవడం అవసరం. పరీక్ష రోజు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రంకు వెళ్లాలి. కేటాయించిన గదిని చూసుకోవాలి. తొలి పరీక్ష రోజు ఇది చాలా ముఖ్యమైంది. బార్‌కోడింగ్ విధానం అమలులో ఉంది కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. ఒఎంఆర్ బార్ కోడ్ షీట్లోని వివరాలు, హాల్ టికెట్‌లోని వివరాలతో సరిచూసుకోవాలి. ఒఎంఆర్ షీట్‌పై వివరాలు సరిగా లేకపోయినా, చినిగిపోయినా, పాడైనా వెంటనే చీఫ్ సూపరింటిండెంట్ దృష్టికి తీసుకువెళ్లాలి. పాడైన ఒఎంఆర్ షీట్ స్థానంలో ఖాళీ ఒఎంఆర్ షీట్ ఇస్తారు.
ఒఎంఆర్ షీట్ మీద ఎటువంటి అదనపు రాతలు, నలిపివేతలు చేయరాదు. అటువంటి వారి పరీక్ష ఫలితం నిలిపేస్తారు. ఒఎంఆర్ షీటపైగాని, మెయిన్ జవాబు పత్రం, అదనపు జవాబు పత్రం, బిట్ పేపర్, మ్యాప్‌లపై ఎక్కడా విద్యార్ధి హాల్ టికెట్ నంబర్ వేయకూడదు. హాల్ టికెట్ నంబరు ఒఎంఆర్ షీట్‌పై ముద్రించి ఉంటుంది. బార్ కోడ్ రీడింగ్ ద్వారా దానిని గుర్తిస్తారు. ప్రతి విద్యార్ధి ఒఎంఆర్ షీట్‌పై కేటాయించబడిన వివరాలు తప్ప మిగిలిన ఏవీ రాయకూడదు. వేరేవారి పేపర్ మీ వద్ద దొరికినా, కాపీలతో పటు్టబడినా మాల్ ప్రాక్టీస్ కింద మిమ్మల్ని డీబార్ చేసే అవకాశంఉంది. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. ఒఎంఆర్ షీట్‌లోని పార్ట్1లో మాత్రమే ఒక సంతకం చేయాల్సి ఉంటుంది. పార్ట్1, పార్ట్2లలో మెయిన్ ఆన్సర్ బుక్‌లెట్ సీరియల్ నంబర్ వేయాల్సి ఉంటుంది. గ్రాఫ్‌పేపర్ (సైన్స్, లెక్కలు) మ్యాప్ (సోషల్ స్టడీస్), బిట్ పేపర్లపై మెయిన్ ఆన్సర్ బుక్‌లెట్ నంబరు మాత్రమే వేయాలి. మెయిన్ ఆన్సర్ షీట్‌కి ఒఎంఆర్ సరిగ్గా పిన్ చేసి ఉందో లేదో చూసుకోవాలి. అలాగే ఇన్విజిలేటర్ సమాయంతో స్టక్కర్లను అంటించేటపుడు స్టాప్లర్ పిన్‌కనబడకుండా చూసుకోవాలి. ఒఎంఆర్ షీట్‌పై ఉన్న రెండు బార్‌కోడ్‌లపై రాయడంగాని నలపడంగాని చేయకూడదు. ఒఎంఆర్ షీట్‌లో పార్ట్1లో మీరు ఎన్ని అదనపు జవాబు పత్రాలు తీసుకున్నారనే సంఖ్య వేయాలి. అలాగే పార్ట్2లో కూడా పూర్తి చేయాలి. జవాబు పత్రంలో ఆకుపచ్చ, ఎరుపురంగు పెన్నులు వాడకూడదు. నీలం లేదా నలుపు రంగులను మాత్రం వాడవచ్చు. మీ జవాబు పత్రాలన్నీ జాగ్రత్తగా టై దారంతో ప్రదాన జవాబు పత్రంకి కలిపి కట్టవలెను. జవాబు పత్రంపై ఎటువంటి పాత చిహ్నాలను వాడరాదు. నిషిద్దమైన అశ్లీల పదజాలం వాడకూడదు. అలారాస్తే 25/1997విద్యా చట్టం ప్రకారం మీ జవాబు పత్రాలను దిద్దకుండా మీపై చర్యలు తీసుకోవచ్చు. జవాబు పత్రం నుండి కాగితాలను చించడం, వేరుచేయడం చేయకూడదు. గణితం రోజున చిత్తుపనికి అదనపు జవాబు పత్రం వాడాలే తప్ప ఇంటి నుండి తెల్లకాగితాలు తీసుకెళ్లకూడదు. సై సూచనలలో ఏమైనా అర్ధం కాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తొలి పరీక్ష రోజు ఇన్విజిలేటర్ సహాయంతో వారి పర్యవేక్షణలో జాగ్రత్తగా ఒఎంఆర్ షీట్‌ను పూర్తి చేసి తర్వాత పరీక్షలకు సిద్దం కావచ్చు.
పరీక్ష రోజు మర్చిపోకూడనివి : 1. బాగా రాసే రెండు బాల్‌పెన్నులు. 2. పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్, 3. స్కేలు, 4. జామెంట్రీబాక్స్, 5. రాసేందుకు ప్యాడ్ (అట్ట), 6. హాల్‌టికెట్
సమాధానాలు ఎలా రాయాలి : 1. ప్రశ్న సంఖ్య తప్పనిసరిగా వేయాలి. 2. సులభమైనవి ముందుగా రాయాలి. 3. పేరాల కంటే పాయింట్ల వారీగా రాస్తే 4మార్కుల ప్రశ్నలకి మంచి మార్కులు వస్తాయి. 4. ముఖ్యవిషయాలను అండర్‌లైన్ చేస్తే బాగుంటుంది. 5. అదనపు ప్రశ్నలు (ఛాయిస్) సమయం మిగిలితేనే రాయండి. 6. 2మార్కుల ప్రశ్నలకి విస్తారంగా రాయనవసరంలేదు. అలా రాయడం వల్ల సమయం వృధా.
ప్రశ్నాపత్రం తీసుకోగానే : పాఠ్యపుస్తకాలు మారిన నేపధ్యంలో కొత్త సిలబస్‌లో ఎక్కడ నుంచయినా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రశ్నాపత్రం చూడటంతోనే కంగారు పడవద్దు. ప్రశ్నలన్నింటినీ క్షుణ్ణంగా చదవండి. బాగా తెలిసిన ప్రశ్నలను టిక్ పెట్టుకుని సమాధానాలు రాయడం ప్రారంభించండి. తగిన ప్రశ్నకు సరిపడు వాక్యాల్లో సమాధానాలు రాస్తే సరిపోతుంది. పటాలను పెన్సిల్‌తో మాత్రమే గీయాలి.
బిట్ పేపర్‌లో : జవాబులు రాయకుండా ఖాళీలను వదలద్దు. కొన్ని సార్లు ప్రశ్నలో తప్పు ఉంటే మార్కు కలిసే అవకాశం ఉంది. ఓవర్ రైటింగ్ చేయవద్దు. కొట్టివేతలు, దిద్దివేతలకు ఆస్కారం ఇవ్వవద్దు. జతపరచడంలో బ్రాకెట్లలో ఎ, బి, సి, డిలకు బదులు ప్రశ్నల సంఖ్యను వేయరాదు. బిట్ పేపర్‌లో కొన్ని బిట్లకు సమాధానం రాయకపోయినా జిపిఎ 10కి 10ఢోకా లేదు. ఎందుకంటే మీకు 92నుండి 100మార్కులలోపు ఎన్ని వచ్చినా (గ్రేడ్ పాయింట్ యావరేజ్) గ్రేడు 10గా ఉంటుంది. బహుళైచ్చిక సమాధాన ప్రశ్నలకు రెండు ఆన్సర్లు రాయవద్దు. బ్రాకెట్‌కి వెలుపుల కూడా రాయకూడదు.
చివరిగా : రాసిన సమాధానాలన్నీ ఒకసారి చూడండి. ప్రశ్నల సంఖ్య సరిగ్గా వేసామా లేదా చూడండి. సమాధాన పత్రాలను సరైన వరుసలో అమర్చి దారం కట్టండి. బిట్ పేపర్ బదులు ప్రశ్నా పత్రం కట్టేస్తుంటారు. జాగ్రత్త తీసుకోండి. పేపర్లపై వరుస సంఖ్య వేసుకుంటే చివరలో దారంతో కట్టడం సులవుగా ఉంటుంది. సమయం పూర్తయ్యేవరకు పరీక్ష హాలునుండి కదల వద్దు. ఆఖరి నిమిషం వరకు రాని వాటికి సమాధానాలు గుర్తుకు తెచ్చుకొనే ప్రయత్నం చేయండి. సమయం మిగిలితేనే ఛాయిస్ రాయండి. లేకుంటే వద్దు. ఇన్విజిలేటర్‌తోను, సహ విద్యార్ధులతోనూ మర్యాద పూర్వకంగా వ్యవహరించండి. సరైన ప్రణాళికతో కష్టపడి చదివి మంచి గ్రేడ్ సాధించండి. శ్రద్ద, ఏకాగ్రత కోసం కొంసేపు ధ్యానం చేయండి.
ఆరోగ్య సూత్రాలు : పరీక్షల సమయంలో కనీసం ఆరుగంటల నిద్ర తక్కవ కాకుండా చూసుకోండి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. మసాలా, కారం, పులుపులను తగ్గించండి. కాచి చల్లార్చిన నీరు తాగండి. అనారోగ్యపు సూచనలు కనిపిస్తే వెంటనే వైద్య చికిత్స పొందివ పరీక్షలను సిద్దం కండి. పరీక్ష మద్యలో ఆకలివేస్తే మెదడు పనిచేయదు. అలాంటప్పుడు చాక్లెట్ చప్పరించండి. తలనొప్పికూడా పోతుంది. మీరు మీ పాఠశాలలో వ్రాసిన మాదిరి పరీక్షలాగానే భావించి ఆత్మవిశ్వాసంలో వ్రాయండి. పరీక్షలంటే పండగలా భావించండి. జీవన్మరణ సమస్యలా భావించవద్దు.
– పవని భానుచంద్రమూర్తి, రిసోర్స్ పర్సన్, ఎస్‌సిఇఆర్‌టి – ఎపి