Home ప్రకాశం అధికార‌పార్టీ స‌ర్పంచే ఎసిబి అధికారుల‌ను ఆశ్రయించాల్సి వ‌చ్చిందంటే….

అధికార‌పార్టీ స‌ర్పంచే ఎసిబి అధికారుల‌ను ఆశ్రయించాల్సి వ‌చ్చిందంటే….

565
0

చీరాల : అధికార పార్టీలో ఉన్న స‌ర్పంచులే ఎసిబి అధికారుల‌ను ఆశ్ర‌యించాల్సి వ‌చ్చిందంటే నియోజ‌క‌వ‌ర్గంలో అవినీతి ఏ స్థాయిలో పెరిగిందో అర్ధం చేసుకోవ‌చ్చ‌ని వైఎస్ఆర్‌సిపి రాష్ట్ర కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ వ‌రికూటి అమృత‌పాణి పేర్కొన్నారు. త‌న నివాసంలో శ‌నివారం విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. చీరాల మండ‌లం దేవాంగ‌పురిలో రూ.18.50ల‌క్ష‌ల విలువైన ప‌నుల‌కు సంబంధించిన బిల్లుల‌పై సంత‌కాలు చేసేందుకు ఆ పంచాయితీ కార్య‌ద‌ర్శి చెంచు అదే పంచాయితీ టిడిపికి చెందిన స‌ర్పంచి పృధివి చాందిని నుండి రూ.70వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారుల‌కు చిక్కిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ఎక్క‌డైనా ప్ర‌తిప‌క్షంలో ఉండే ప్ర‌జాప్ర‌తినిధులు అధికారుల‌తో ప‌నులు చేయించుకునేందుకు తంటాలు ప‌డుతుండ‌టం చూశామ‌ని అన్నారు. అలాంటిది అధికార పార్టీలో ఉండి ప‌నులు చేయించుకునేందుకు అధికారుల‌కు లంచం ఇవ్వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందంటే అవినీతి తీవ్ర‌త ఏస్థాయిలో ఉందో, అలాంటి అధికారులను కాపాడేవాళ్లెవ్వ‌రో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు చూస్తున్నార‌ని పేర్కొన్నారు.

దేవాంగ‌పురి పంచాయితీకి ఎస్‌సి, ఎస్‌టి ఉప‌ప్ర‌ణాళిక నుండి 2016లో మంజూరైన నిధులు కూడా నేటికీ ఖ‌ర్చు చేయ‌లేదంటే అభివృద్దిపై ప్ర‌భుత్వానికి, అధికారుల‌కు ఉన్న శ్ర‌ద్ద ఏమిట‌ని ప్ర‌శ్నించారు. చీరాల‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ప్ర‌భుత్వ అధికారులు స్వ‌తంత్రంగా ప‌నిచేస్తున్నార‌ని ఆరోపించారు. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌లు ఇలాంటి అక్ర‌మాల‌ను గుర్తించి రానున్న రోజుల్లో బుద్ది చెప్పాల‌ని కోరారు. స‌మావేశంలో న్యాయ‌వాది కర్నేటి రవి, కౌన్సిల‌ర్‌ పొదిలి స్వామి, కొత్త‌పేట మాజీ స‌ర్పంచి చుండూరి వాసు, కుమార్, బాబు, రాజ్ కుమార్, కిషోర్, బుజ్జిబాబు, ప్రసాద్, యాతం క్రాంతికుమార్ పాల్గొన్నారు.