చీరాల : అత్యధిక ఓటర్లు ఉన్న చేనేతలను మరోసారి మోసం చేసేందుకు జాతీయ చేనేత దినోత్సవం పేరుతో చీరాలవచ్చి చంద్రబాబు ఆరచించని వరాలు కురిపించారని వైఎస్ఆర్‌సిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి యడం బాలాజీ ఆరోపించారు. చీరాల పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చేనేత రుణమాఫీ నేటికీ అమలు కాలేదన్నారు. ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తుందని ఎదురు చూస్తున్న చేనేత కార్మికులకు నేటికీ రుణాలు చెల్లించాలని బ్యాంకులనుండి నోటీసులు అందుతున్నాయని గుర్తు చేశారు. చేనేత వృత్తిలో ఉపాధి అవకాశాలు సక్రమంగా లేక ఇతర వృత్తులకు వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. చేనేతలకు శిక్షణ ఇచ్చి వృత్తి అభివృద్దికి దోహద పడాల్సిన చేనేత క్లస్టర్లు అధికార పార్టీ కార్యకర్తలకు ఆదాయ వనరుగా మారిందని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబునాయుడు అబద్దాలు చెప్పడం మానుకోవాలని కోరారు. సమావేశంలో వైఎస్ఆర్‌సిపి పట్టణ అధ్యక్షులు బొనిగల జైసన్‌బాబు, మండల అధ్యక్షులు పిన్నిబోయిన రామకృష్ణ, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ కొరబండి సురేష్, పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాసరావు, నీలం శ్యామ్, షేక్ సుభాని, యడం రవిశంకర్ పాల్గొన్నారు.