Home ఆంధ్రప్రదేశ్ రౌడీషీట‌ర్ల‌ను కూర్చోబెట్టి మాట్లాడ‌ట‌మా? ఫ్రెండ్లీ పోలీస్ అంటే…!

రౌడీషీట‌ర్ల‌ను కూర్చోబెట్టి మాట్లాడ‌ట‌మా? ఫ్రెండ్లీ పోలీస్ అంటే…!

438
0

అనంతపురం : జిల్లాలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆరోపించారు. ఆయన బుధ‌వారం విలేకరులతో మాట్లాడారు. ఆలూరులో ఎస్‌ఐపై ఓ వ్యక్తి వాద‌న‌కు దిగడంతో పాటు చేయిచేసుకున్న వైనాన్ని జెసి గుర్తు చేశారు. ‘పిక్‌ పాకెటర్ల‌ను, మట్కారాయుళ్లను, రౌడీషీటర్లను స్టేషన్లకు పిలిపించి వారిని గౌరవంగా కుర్చీలో కూర్చోబెట్టి… ఓ కప్పు కాఫీ ఇచ్చి… ఏం సార్‌…! మట్కా ఆడుతున్నారా? దొంగతనం చేశారా? దొంగ ఇసుక అమ్ముతున్నారా అని మాట్లాడడం మన పోలీసు సిద్ధాంతమేమో..! ఫ్రెండ్లీ పోలీస్‌ అంటే ఇదేనా..? అంటూ జెసి దివాక‌ర‌రెడ్డి ప్ర‌శ్నించారు.

పోలీసులను కొట్టినా వారిపై చర్యలు తీసుకోలేనంత ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయ‌డం పోలీసులకు మంచిదికాదు. ఇలాంటి పరిస్థితుల్లో శాంతిభద్రతలు ఏవిధంగా కాపాడతారు? అన్నారు. పోలీసులకు చేవ చచ్చిపోయిందా? తప్పుడు నాయాళ్లను కుర్చీలో కూర్చోబెట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే సరిపోద్దా?’ అని విరుచుకుపడ్డారు. పోలీసులకు అసలు వెన్నుముకే లేదన్నారు. ప‌ల్లెల్లో పెద్దమనుషులుగా చలామణీ అవుతున్న వాళ్ల‌ వద్దకు, దాదాగిరి చేసేవాళ్ల వద్దకెళ్లి పనిచేయించుకోవాల్సి వస్తోందని హెచ్చ‌రించారు. ఈ పోలీసుల ప‌రిస్థితిని సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్‌ దృష్టికి తీసుకెళ్తాన‌న్నారు.