– బిజెపి సిఎం అభ్యర్ధిగా విప్లవ్‌కుమార్‌దేవ్
అగర్తలా : తాము ఓటమిని ఊహించలేదని త్రిపుర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అన్నారు. బిజెపి గెలుస్తుందనుకోలేదన్నారు. త్రిపుర ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు పనిచేశారు. శనివారం వెల్లడైన ఫలితాల్లో బిజెపి -ఐపిఎఫ్‌టి కూటమి గెలుపొందడంతో ఆయన తన పదవికి ఫలితాలు వెలువడిన అనంతరం రాజీనామా చేశారు. అన్ని ప్రాంతాల నుండి పూర్తి వివరాల్ని సేకరించి ఫలితాలను విశ్లేషిస్తామన్నారు. ఎన్నికల్లో ఓటమిని సమీక్షించుకుంటామని పేర్కొన్నారు. నిజానికి ఇలాంటి ఫలితం కోసం తాము సన్నద్ధం కాలేదన్నారు.
తమ పార్టీ (సిపిఎం) ఓడిపోతుందని ఊహించలేదన్నారు. గవర్నర్ తథాగత రారు సూచనమేరకు, కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసేదాకా తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతానన్నారు. త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా బిజెపి కూటమి ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు విప్లవ్ కుమార్ దేవ్‌ను ఎంపిక చేశారు. అయితే మంగళవారం బిజెపి-ఐపిఎఫ్‌టి కూటమి ఎమ్మెల్యేల భేటీ అనంతరం విప్లవ్ పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.