ఒంగోలు : రానున్న ఎన్నికల్లో అధికార టీడీపీ ఎత్తులను చిత్తు చేయాలని వైసిపి జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యకర్తలకు సూచించారు. వైఎస్సార్‌సీపీ మద్దతు దార్ల ఓట్లు తొలగించడం, పోలింగ్ బూత్‌లు మార్చడలాంటి అనేక ఎత్తులు వేస్తారని చెప్పారు. నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొట్టాలని సూరించారు. మంగళవారం సాయంత్రం నగరంలోని 38, 43, 44, 45 డివిజన్ల పరిధిలోని పోలింగ్ బూత్ కన్వినర్లు, సభ్యులతో కర్నూలు రోడ్డులోని మహాలక్ష్మీ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ప్రతీ ఇంటికీ వెళ్లి ఓటరు జాబితాలను సరిచూడాలన్నారు. అర్హులైన కొత్త ఓటర్లను చేర్పించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. నాలుగేళ్ల నుంచి టీడీపీ సాగించిన అరాచకాలకు మరో ఏడాదిలో చెక్ పెట్టేందుకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు.
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించడం, అందరికీ ఇళ్లంటూ ఊదరగొడుతున్నారని ఆరోపించారు. పేదలకోసం ఇప్పుడు హడావుడి చేసే టిడిపి నేతలకు ఇప్పటిదాకా పేద ప్రజలు కనపడలేదా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో తాను కొంత నిర్లక్ష్యం చేసినందు వల్లే ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని చెప్పారు. ఇకపై కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కలిసి పోరాడదామన్నారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు శింగరాజు వెంకట్రావు, డివిజన్ అధ్యక్షులు ఆకుల మోహన్‌రావు, కండె రమణా యాదవ్, గోపిరెడ్డి గోపాలరెడ్డి, పల్నాటి రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.