ఢిల్లీ : సుఫ్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రాణాంతక రుగ్మతలతో బాధపడుతున్న రోగుల స్వచ్ఛందంగా చనిపోవచ్చని సుఫ్రీం కోర్టు ప్రకటించింది. ఇప్పటివరకు ఎవ్వరూ బలవన్మరణం, స్వచ్ఛంద మరణం పొందే హక్కు లేదు. అలా ఎవ్వరైనా చనిపోతే కేసులు నమోదు చేసి విచారణ చేసేవాళ్లు. తాజా తీర్పులో ‘సజీవ వీలునామా’ను పరిగణనలోకి తీసుకుని పరోక్ష కారుణ్య మరణాన్ని ప్రసాదించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. పరోక్ష కారుణ్య మరణాలు, వాటి కోసం పరిగణించే సజీవ వీలునామా అనుమతించదగినవే అని కోర్టు పేర్కొంది. అయితే ఇలాంటి కేసుల్లో సజీవ వీలునామాను పరిగణనలోకి తీసుకోడానికి అవసరమైన కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ కేసులపై చట్టాన్ని తీసుకొచ్చేవరకు ఈ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. వైద్యంతో నయం కాని రోగాలతో బాధపడే రోగులకు ఆ బాధల నుంచి విముక్తి కల్పించేందుకు పరోక్ష కారుణ్య మరణాలను ప్రసాదించాలని కామన్ కాస్ అనే ఎన్జీవో సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఇందుకు సజీవ వీలునామాను పరిగణనలోకి తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. సదరు రోగులు తమకు ఇవ్వాల్సిన చికిత్సపై ముందుగానే సూచనలు జారీ చేసే పత్రాన్ని సజీవ వీలునామాగా పేర్కొంటారు. ఈ పిటిషన్‌పై గతేడాది అక్టోబరు 11నే వాదనలు జరిగాయి. వాదనల ముగింపు అనంతరం సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. తాజాగా శుక్రవారం దీనిపై తీర్పును వెల్లడించింది.
అదే సమయంలో కారుణ్య మరణాలను అమలుచేసేందుకు కొన్ని మార్గదర్శకాలను తయారుచేసింది. సజీవ వీలునామాను పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. అందుకు సదరు రోగుల కుటుంబసభ్యుల నుండి అనుమతి ఉండాలని పేర్కొంది. వీరితో పాటు ఆ రోగి కోలుకోవడం సాధ్యం కాదని చెప్పిన వైద్యుల బృంధం అనుమతి కూడా ఉండాలని సూచించింది. సజీవ వీలునామాను తీసుకుని రోగి కుటుంబసభ్యులు లేదా సన్నిహితులు హైకోర్టుకు వెళితే పరోక్ష కారుణ్యం అవసరమో లేదో నిర్ణయించేందుకు ఆ న్యాయస్థానం మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని తెలిపింది. ఈ సందర్భంగా జస్టిస్ దీపక్ మిశ్రా తీర్పును వెలువరిస్తూ అలాంటి రోగులకు గౌరవంగా చనిపోయే హక్కు ఉంటుందని పేర్కొన్నారు.