చీరాల : అట్రాసిటీ చట్టాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని దళిత మహాసభ వ్యవస్థాపకులు కత్తి పద్మారావు కోరారు. చీరాల అంబేద్కర్ భవనంలో అట్రాసిటీ చట్టం – విశ్లేషణ సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి పరిపాలనలో దళితులపై దాడులు పెరిగాయన్నారు. దళితుల ద్రోహి నరేంద్ర మోడీ అన్నారు. దళితులకు రక్షణగా ఉన్న అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలో కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కుట్రలను దళితులందరూ ఐక్యంగా తిప్పికొట్టాలని కోరారు.
బిజెపి నాయకులు దారా సాంబయ్య మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అట్రాసిటీ చట్టాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు. తొమ్మిదో షెడ్యూల్లో అట్రాసిటీ చట్టాన్ని చేరుస్తారని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాని, కోటి ఆనందబాబు, అంబేద్కర్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు చిరంజీవి, రిటైర్డ్ ఎసిపి కట్టా రాజ్ వినయ్ కుమార్, చేనేత జన సమాఖ్య అధ్యక్షుడు మాచర్ల మోహన్రావు, ఎరుకుల హక్కుల సంఘం నాయకులు మోహన్ కుమార్ ధర్మా, చేనేత నాయకీలు బీరక సురేంద్ర, ఎంపి రత్నకుమార్, చుడూరి వాసు పాల్గొన్నారు.