Home ఆంధ్రప్రదేశ్ రీడిప్లాయిడ్ ఎంప్లాయిస్… జీవిత‌కాలం అతిధులే

రీడిప్లాయిడ్ ఎంప్లాయిస్… జీవిత‌కాలం అతిధులే

426
0

అమ‌రావ‌తి : “రెంటికి చెడ్డ రేవ‌డి“, “ఇంటి కూటికి… బంతికూటికీ నోచుకోని వైనం.“ ఇలాంటి సామెతులు అంద‌రూ వినే ఉంటారు. కానీ అలాంటి సామెతులు ఇలాంటి వారి జీవితాల‌ను చూసే పుట్టి ఉంటాయ‌నుకుంటా. అదేంటి అనుకుంటున్నారా? అదేనండీ కొన్ని సంవ‌త్స‌రాల క్రితం ప్ర‌భుత్వ‌మే విద్యావ్య‌స్థ‌ను అభివృద్ది చేసేందుకు ప్ర‌వేటు సంస్థ‌ల‌ను ప్రోత్స‌హించింది. ప్ర‌వేటు యాజ‌మాన్యంలో ఏర్పాటైన విద్యాసంస్థ‌ల‌ను ప్ర‌భుత్వం బాధ్య‌త తీసుకుని (ఎయిడెడ్ జూనియ‌ర్ క‌ళాశాల‌లు) నిర్వ‌హించింది. ఆయా క‌ళాశాల‌ల్లో మౌళిక వ‌స‌తులు యాజ‌మాన్యం క‌ల్పిస్తే సిబ్బంది వేత‌నాలు మాత్రం ప్ర‌భుత్వ‌మే చెల్లిస్తుంది. వీరికి విద్యాసంస్థే యూనిట్‌గా ప‌రిగ‌ణిస్తారు. ప‌దోన్న‌తులు అక్క‌డ ప‌నిచేసేవారు ఉద్యోగ విర‌మ‌ణ పొందితే వారి వెనుక చేరిన వారికి ప‌దోన్న‌తి వ‌స్తుంది. అలా ప్ర‌భుత్వ‌, ఎయిడెడ్ విద్యాసంస్థ‌లకు ప్ర‌తిష్ట బాగున్నంత‌కాలం ఆ సంస్థ‌ల్లో ప‌నిచేసే సిబ్బంది ప‌రిస్థితి బాగానే ఉంది.

విద్యార్ధుల సంఖ్య కుదించుకుపోయే ప‌రిస్థితి మొద‌లైన‌ప్ప‌టి నుండి ఒక్క‌క్క క‌ళాశాల‌లో విద్యార్ధులు లేక కొన్ని గ్రూపులు ఎత్తేసుకోవాల్సి వ‌చ్చింది. కొన్ని క‌ళాశాల‌లు పూర్తిగా మూత‌ప‌డ్డాయి. అలాంటి చోట ప‌నిచేస్తున్న సిబ్బందిని మాత్రం స‌మీపంలోని ప్ర‌భుత్వ‌ క‌ళాశాల‌ల‌కు (రీడెప్లాయిడ్‌) బ‌ద‌లాయించారు. వీరికి మాతృ సంస్థ ఉండ‌దు. ప‌నిచేసే సంస్థ‌లో ఎప్ప‌టికీ క‌ల‌వ‌రు. కానీ ఎయిడెడ్ వేత‌నం మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్తించే సౌక‌ర్యాలేమీ వ‌ర్తించ‌డంలేదు. ప్ర‌భుత్వ కాలేజీల్లో ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ అటెండెన్స్ రిజిస్ట‌ర్ నుండి వేత‌న చెల్లింపుల వ‌ర‌కు అన్నీ ప్ర‌త్యేకంగానే ఉంటాయి. దీంతో ప‌దోన్న‌తులు లేక‌, మాతృసంస్థ లేక‌, ప్ర‌భుత్వ సౌక‌ర్యాలు వ‌ర్తించ‌క అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.

ఇంటి కూటికీ… బంతి కూటికీ… చెడ‌ట‌మంటే ఇదే…
ప్ర‌భుత్వం నుండి వేత‌నం పొందుతున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ ఉద్యోగులు కాదు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కైతే ఆరోగ్య భీమా వ‌ర్తిస్తుంది. రీడెప్లాయిడ్ సిబ్బందికి మాత్రం వ‌ర్తించ‌దు. అలాగ‌ని పేద‌ల జాబితాలో లేరు. పేద‌లైతే ఎన్‌టిఆర్ ఆరోగ్య ర‌క్ష ప‌థ‌కం వ‌ర్తిస్తుంది. అటు ఉద్యోగ ఆరోగ్య భీమా, ఇటు ఎన్‌టిఆర్ ఆరోగ్య ర‌క్ష రెండూ వ‌ర్తించ‌క‌పోవ‌డంతో జ‌ర‌గ‌రానిదేదైనా జ‌రిగితే వీరి ప‌రిస్థితి వ‌ర్ణ‌ణాతీత‌మే.

నామ‌మాత్ర‌పు ప‌నికే ప‌రిమితం – ఇత‌ర శాఖ‌ల‌కు అర్హ‌త‌ల‌ను బ‌ట్టి బ‌ద‌లాయించాలి
పేరుకు ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల్లో నాన్‌టీచింగ్ విభాగంలో ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ వీరికి వేత‌నానికి త‌గిన ప‌నీలేదు. దీంతో నాన్‌టీచింగ్ రీడెప్లాయిడ్ సిబ్బందిని విద్యార్హ‌త‌ల‌ను బ‌ట్టి ప్ర‌భుత్వం ఇత‌ర శాఖ‌ల‌కు బ‌ద‌లాయించుకుంటే వేత‌నానికి త‌గిన ప‌నిచేయించుకునే అవ‌కాశం ఉంటుంది. అలాంటి ప‌దోన్న‌తులు, బాధ్య‌త‌లు ఇచ్చి ప‌నిచేయించుకోవాల‌ని రీడెప్లాయిడ్ సిబ్బంది కోరుతున్నారు. ఇత‌ర శాఖ‌ల్లో క‌లుపుకుంటే సిబ్బంది కొర‌త అధిగ‌మించ‌వ‌చ్చు. దీనివ‌ల్ల ప్ర‌భుత్వానికీ ఆర్ధిక భారం ఉండ‌దు.

ఎంత మంది ఉంటారు?
రాష్ట్ర‌వ్యాప్తంగా మూత‌ప‌డిన ఎయిడెడ్ క‌ళాశాల‌ల‌తోపాటు ప్ర‌స్తుతం క‌ళాశాల ఉండి సైన్స్ గ్రూపుల‌ను ఎత్తివేసిన క‌ళాశాల‌ల్లో సుమారు 250నుండి 300మందికిపైగా సిబ్బంది ఇత‌ర క‌ళాశాల‌ల్లో జీవిత‌కాలం అతిధి ఉద్యోగం చేస్తూ ఎలాంటి ప‌దోన్న‌తులు, ప్ర‌భుత్వ రాయితీల‌కు నోచుకోకుండా ప‌నిచేస్తున్నారు. ఇలాంటి వారిని ఇత‌ర ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు బ‌ద‌లాయిస్తే కొంత‌మేర‌కు ప్ర‌భుత్వానికీ ప‌నిలేని భారం త‌ప్పుతుంది. ఉన్న‌తాధికారులు జోక్యం చేసుకుని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళితేనే ప‌రిష్కారం క‌నిపిస్తుంది.

జీవిత కాలం ప‌నిచేసి ఉద్యోగ విర‌మ‌ణ పొంద‌డ‌మే….
రీడిప్లాయిడ్‌గా వెళ్లిన సిబ్బంది జీవిత కాలం విధులు నిర్వ‌హించి ఉద్యోగ విర‌మ‌ణ పొంద‌డంత‌ప్ప ప‌దోన్న‌తులు ఏమీ ఉండ‌వ‌ని గుంటూరు ఆర్‌జెడి కోటేశ్వ‌ర‌రావు పేర్కొన్నారు. ఇత‌ర ప్ర‌భుత్వ శాఖ‌ల్లో కూడా విలీనం చేసే ప‌రిస్థితి లేద‌న్నారు. వీరికీ ఇహెచ్ఎస్‌, హెల్త్ రీఎంబ‌ర్స్‌మెంట్ వంటి సౌక‌ర్యాలు వ‌ర్తిస్తాయ‌న్నారు. రీడెప్లాయిడ్ సిబ్బంది ఈపాటికే స‌గం మంది ఉద్యోగ విర‌మ‌ణ పొందార‌న్నారు. మిగిల‌న‌వాళ్లూ ఉద్యోగ విర‌మ‌ణ‌కు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నార‌న్నారు. కొద్దిమంది మాత్ర‌మే ఎక్కువ కాలం స‌ర్వీసు ఉన్న‌ప్ప‌టికీ చేయ‌గ‌లిగేదేమీలేద‌ని, అలా ప‌నిచేసుకుని ఉద్యోగ విర‌మ‌ణ పొంద‌డ‌మేన‌ని చెప్పారు.