Home ఆంధ్రప్రదేశ్ నూతన ఆవిష్కరణల వేదిక.. బాలల సైన్స్ కాంగ్రెస్

నూతన ఆవిష్కరణల వేదిక.. బాలల సైన్స్ కాంగ్రెస్

1060
0

అనంత‌పురం : 13 జిల్లాల పిజిక‌ల్‌ సైన్స్ ఉపాధ్యాయుల‌ కార్యవర్గ స‌మావేశం నిర్వ‌హించారు. ఫోరం నాయ‌కుల మూడేళ్ల శ్ర‌మ‌కు ఫ‌లితంగా రాష్ట్ర‌వ్యాప్తంగా పిఎస్ ఉపాధ్యాయులు ఒక్క‌చోట‌కు చేరారు. ఫోరం వేదిక‌లో జాతీయ సైన్స్ కాంగ్రెస్ అంశంపై చ‌ర్చించారు. యూనియ‌న్ల‌కు అతీతంగా స‌బ్జెక్టు ఉపాధ్యాయులు ఒక్క‌చోట చేరారు. ఈ స‌మావేశంలో చ‌ర్చించిన అంశాల సారాంశం…

పుస్తకాల్లోని జ్ఞానం.. తరగతి గదిలో నేర్చుకునే విద్యతో పాఠశాలల బాలల్లో దాగిన సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ విజ్ఞన శాస్త్ర పరిజ్ఞానాన్ని, ఆసక్తిని పెంచి ఆవిష్కరణ వైపు పరిశోధనలు చేసేలా వారిని బాలల సైన్స్ కాంగ్రెస్ తీర్చిదిద్దుతుంది. బాలలు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలకు శాస్త్రీయ పద్ధతుల ద్వారా పరిష్కారాలను కనుగోనే సామర్థ్యాన్ని పెంచుతుంది. భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదిగే లక్ష్యాలను వారిలో కల్పిస్తోంది. జిల్లాస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

పాఠశాలల్లోని 10-17 ఏళ్ల వయస్సు గల బాలలను శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు చేసేలా తీర్చిదిద్దాలన్నది జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లక్ష్యం. 1993 నుంచి జాతీయ శాస్త్ర సాంకేతిక సమాచార మండలి ద్వారా రాష్ట్రంలోని ఆ శాఖ ఆధ్వర్యంలో విద్యాశాఖ సహకారంతో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంస్థ జిల్లాస్థాయిలో చేపడుతున్న కార్యక్రమాల ద్వారా పాఠశాలల బాలలు పలు సమస్యలపై నూతన ఆవిష్కరణలకు తెరలేపుతున్నారు. ప్రతి రెండేళ్లకొకసారి ఒక అంశం, 5 ఉప అంశాలపై సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సారి పరిశుభ్రమయిన, హరిత, ఆరోగ్యకర జాతి కోసం విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు ప్రధానాంశంగా నిర్వహించే సైన్స్ కాంగ్రెస్‌లో ఐదు ఉప అంశాలు
1.ఆవరణ వ్యవస్థ – అది అందించే సేవలు, 2.ఆరోగ్యం, పరిశుభ్రత, పారిశుద్ద్యం. 3. చెత్త నుండి సంపద. 4. సమాజం, సంస్క్రతి, జీవనోపాధులు. 5.సాంప్రదాయక విజ్ఞాన వ్యవస్థలు అనే ఉప అంశాలను ప్రాజెక్ట్‌ల కొరకు నిర్థారించారు. వీటిల్లో ఒక ఉప అంశానికి సంబంధించినదై అది వారి పాఠశాల, పరిసరాలు, గ్రామానికి సంబంధించిన అంశంగా ఉండేలా ప్రాజెక్ట్‌ను రూపొందించాలి. ప్రాజెక్ట్‌ల ద్వారా వనరు గుర్తింపు, వనరు విలువ తెలియజేయటం, వనరుకు గల ముప్పు గుర్తించుట, నిర్వాహణ ప్రణాళికలనేవి ఆశించిన ఫలితాలుగా గుర్తిస్తారు.

విద్యార్థులు ఇలా చేయాలి..
ఇద్దరు బాలలు గ్రూపుగా, గైడ్ టీచర్ సహకారంతో ఎంచుకున్న ఉప అంశానికి స్థానికంగా ఉన్న సమస్యలను పరిశీలించడం, సర్వేలు చేయడం, కారణాలను విశ్లేషించడం, ప్రజల నుంచి ప్రశ్నావళి రూపంలో సమాధానాలను రాబట్టడం, విమర్శనాత్మకంగా సమస్యపై ఆలోచించి పరిష్కార మార్గాలపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిశోధనలు చేసి పరిశోధన పత్రాలను సైన్స్ కాంగ్రెస్‌లో టీమ్ లీడర్ సమర్పించాలి.

పెరుగుతున్న శాస్త్రీయ దృక్పథం : ఎన్‌సిఎస్‌సి జిల్లా అకడమిక్ కో ఆర్డినేటర్ పవని భానుచంద్రమూర్తి
జిల్లాలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు రాను రాను బాలల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుతుంది. ప్రాజెక్ట్ పరిశోధనలో ఉప అంశాలకు అనుగుణంగా జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల బాలలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను ఆకళింపు చేసుకుని వాటిని పరిశోధనాత్మకంగా పరిశీలిస్తూ పరిష్కార మార్గాలపై నమూనాలు ప్రదర్శిస్తున్నారు. మొదట్లో జిల్లా సైన్స్ కాంగ్రెస్‌కు స్పందనగా పది మంది లోపే పాల్గొనగా రాను రాను వారి సంఖ్య 200 వరకు పెరుగుతూ వచ్చింది. రాష్ట్ర, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో 10 మంది వరకూ జిల్లా నుంచి పాల్గొని పరిశోధనలతో అబ్బుర పరుస్తున్నారు.

ప్రోత్సాహం కావాలి..
సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనే జిల్లాలోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌స్పైర్‌కి ఒక్కో విద్యార్థికి రూ.5వేలు చొప్పున అందిస్తూ ప్రోత్సహిస్తున్న విధంగానే జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రోత్సహిస్తే బాగుంటుందని, బాలల సైన్స్ కాంగ్రెస్‌కు వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని ఓ విద్యావేత్త పేర్కొన్నారు.

బాలల స్పందన బాగుంది : ఎన్‌సిఎస్‌సి జిల్లా కో ఆర్డినేటర్ మావిళ్ళపల్లి శ్రీనివాసులు రెడ్డి
జిల్లాలో నిర్వహించే సైన్స్ కాంగ్రెస్‌కు బాలల నుంచి స్పందన పెరుగుతోంది. ఆలోచింపజేసే నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు నమూనాలు రూపొందిస్తున్నారు. ఆదరణ పెరిగిన ప్రాజెక్ట్ తయారి ఖర్చులు లేక వెనుకంజ వేస్తున్నారు. తొలుత కేవలం 3 ప్రదర్శనలతో 2003 లో మొదలయిన సైన్స్ కాంగ్రెస్ జిల్లాస్థాయిలో జరిగే కార్యక్రమానికి గతం సంవత్సరం 400 కి పైగా నమూనాలు రావడం విశేషం. ఈ సారి మరింత స్పందన ఆశిస్తున్నాం. ప్రాజెక్ట్‌ల అనంతరం విద్యాశాఖాధికారి ఉత్తమ మైన ప్రదర్శనలకు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు.

రాసితోపాటు వాసి కూడా పెర‌గాలి : డిఇఒ
ఎన్‌సిఎస్‌సి విషయంలో రాశి తోపాటూ వాసి కూడా పెరగాల‌ని డిఇఒ విఎస్ సుబ్బారావు పేర్కొన్నారు. ప్రాజెక్టుల సంఖ్య మెరుగ్గానే ఉన్నా పాఠశాలల ప్రాతినిధ్యం పెరగాల్సి ఉంది. 26వ ఎన్‌సిఎస్‌సి జిల్లా ప్రదర్శనకు అందరూ సిద్ధం కావాలి. సైన్స్ ఉపాధ్యాయులలో చురుకుదనం పెరగాలని కోరారు.