అమరావతి : పరిటాల రవి తెలియని వారెవ్వరూ ఉండరు. పేదల మనిషిగా నక్సలైటు పార్టీలో పనిచేస్తూ ఎన్‌టిఆర్ స్పూర్తితో టిడిపిలో చేరిన పరిటాల రవి హత్యచేయబడ్డ విషయం అందరికీ తెలుసు. అలాంటి పరిటాల రవి సహచరునిగా 2014ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో పోతుల సురేష్, సునీత దంపతులు అడుగు పెట్టారు. అప్పటి ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా పోతుల సునీత చీరాల నియోజకవర్గం నుండి పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీలో నిలిచిన ఆమంచి కృష్ణమోహన్ చేతిలో ఓటమి చెందారు. ఆతర్వాత జరిగిన పరిమణామాల్లో ఆమంచి కృష్ణమోహన్ టిడిపిలో చేరారు. పార్టీ ఇన్‌ఛార్జీగా ఉన్న పోతుల సునీతకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంఎల్‌సి పదవి ఇవ్వడం, క్రమంగా చీరాల నియోజకవర్గ రాజకీయాలకు దూరయ్యారు. ప్రస్తుతం చంద్రబాబు బావమరిది, వియ్యంకుడైన బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం వైపు ఆసక్తి పెంచుకుంటున్నట్లు ఇటీవల ఒక టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోతుల సురేష్ వెళ్లడించడం చర్చనీయాంశమైంది.
టివి ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాలను పోతుల సురేష్ వెళ్లడించారు. 2004లో ఉన్న పరిస్థితులను వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో రాజీ చేసుకుంటే మంచిదని ఒక దశలో తాను పరిటాల రవివద్ద ప్రతిపాదించినట్టు పోతుల సురేష్ చెప్పారు. దానితోపాటు మరో రెండు ప్రతిపాదనలను కూడ తీసుకెళ్లినాని చెప్పారు. రవి మాత్రం ససెమీరా అన్నారని సురేష్ చెప్పుకొచ్చారు. పరిటాల రవితో తనకు ఉన్న సంబంధాలు, రాజకీయ భవిష్యత్ గురించి వివరించారు. ఇప్పటివరకు తమకు అండగా ఉన్న గ్రూపును కాపాడుకొనేందుకు గాను నేతలంతా కలిసే ఉండాలనేది మొదటి ప్రతిపాదనగా పరిటాల రవి వద్ద ప్రస్తావించినట్లు చెప్పారు. ఇక వ్యక్తిగతంగా ఎవరికి వారు అజ్ఞాతంలోకి వెళ్లి ప్రాణాలు రక్షించుకోవడం రెండో ప్రతిపాదనగా రవికి చెప్పానని ఆయన గుర్తు చేశారు. ఇక మూడో అంశంగా ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌తో రాజీ ప్రతిపాదనను చేశానని సురేష్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ కుటుంబం.. టీడీపీ అధికారంలోకి వస్తే మనకు ఇబ్బంది ఉండదని తాను ఈ ప్రతిపాదన చేసినట్టు పోతుల సురేష్ చెప్పారు.
అయితే ఈ మూడు ప్రతిపాదనలను పరిటాల రవి తీవ్రంగా వ్యతిరేకించారని పోతుల సురేష్ చెప్పారు. ఆనాడు నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎవరికి వారు అజ్ఞాతంలోకి వెళ్లి ప్రాణాలు దక్కించకోవడమే మేలని పరిటాల రవి సూచించారని పోతుల సురేష్ గుర్తు చేశారు. అయితే ఎంఎల్ఎ అయినందున తాను మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లనని పరిటాల రవి స్పష్టం చేసారని సురేష్ గుర్తు చేసుకున్నారు. ఆర్ఓసీ నేతగా ఉన్న తగరకుంట ప్రభాకర్ రెడ్డి హత్య తర్వాత తమ ప్రాణాలకు కూడ ముప్పు ఉంటుందని భావించిన నేపథ్యంలో తమ కుటుంబసభ్యులు, సన్నిహితుల సూచన మేరకు తాను కూడ అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
పరిటాల రవికి తాను గురువునని పోతుల సురేష్ చెప్పుకొచ్చారు. పీపుల్స్ వార్ (ఇప్పటి మావోయిస్టు పార్టీ)లో తాము పనిచేసేవారమని చెప్పారు. 1983 లో పీపుల్స్ వార్ పార్టీ పరిటాల రవిని పార్టీలో పుల్‌టైమర్‌గా పనిచేయాలని కోరిందన్నారు. కానీ, రవి మాత్రం పార్టీకి గ్రామంలో ఉంటూనే సహాయం చేసేందుకు అంగీకరించాడని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరాడన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గురువును మించిన శిష్యుడుగా పరిటాల రవి ఎదిగాడని పోతుల సురేష్ చెప్పారు. ఆర్ఓసీని ఏర్పాటు చేసి పరిటాల ప్రత్యర్ధులను చంపడమే లక్ష్యంగా పెట్టుకొన్నట్టు జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఎవరిపైన తాము ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదన్నారు. అలా చేసినట్టు నిరూపిస్తే తాను అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ వద్ద ఉరేసుకొంటానని చెప్పారు. 1997-98 కాలంలో అనంతపురంలో పరిటాల రవి ఇల్లు నిర్మిస్తున్న సమయంలో సూట్ కేసు బాంబు పేలుడు జరిగిందన్నారు.
ఆనాటి ఘటన తర్వాతే వైఎస్ కుటుంబానికి పరిటాల కుటుంబానికి మధ్య విబేధాలు వచ్చాయని పోతుల సురేష్ అభిప్రాయపడ్డారు. మరో వైపు వైఎస్ రాజారెడ్డిని హత్య చేసిన వారికి పరిటాల రవి సహకరించాడనే ప్రచారం జరిగిన సమయంలో కూడ ఈ విషయమై తాను రవితో చర్చించినట్లు పోతుల సురేష్ చెప్పారు. పరిటాల రవి కుటుంబాన్ని తన కుటుంబంగానే తాను భావిస్తానని ఆయన చెప్పారు. రవి కుటుంబసభ్యులు కూడ అదే రకంగా భావిస్తారని తాను అనుకొంటున్నట్లు ఆయన చెప్పారు. తన భార్య సునీతకు ఎమ్మెల్సీ విషయంలో సహకరించాలని పరిటాల సునీతను కోరినట్లుగా సురేష్ గుర్తు చేశారు. 2019ఎన్నికల్లో హిందూపురం ఎంపీ టిక్కెట్టు తనకు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తాను కోరుతున్నట్లు సురేష్ చెప్పారు. పరిటాల శ్రీరామ్ ఒక వేళ ఎంపీ స్థానం నుండి బరిలోకి దిగితే తాను ఎమ్మెల్యే స్థానం నుండి పోటీ చేస్తానని సురేష్ చెప్పారు. పోతుల సురేష్ టివి చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో వెళ్లడించిన అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.