వేటపాలెం : పందిళ్లపల్లి జెడ్‌పి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి వెంకటేశ్వరరావు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. గుంటూరు జిల్లా అనంతవరంకు చెందిన ఆయన 1989లో బిఇడి ఉపాధ్యాయులుగా చేరారు. 16సంవత్సరాలు గుంటూరు జిల్లాలో బిఇడి ఉపాధ్యాయులుగా పనిచేశారు. 2005లో గజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతిపై ప్రకాశం జిల్లా బేస్తవారుపేట మండలంలో పనిచేశారు. 2012లో పందిళ్లపల్లి జెడ్‌పి ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చారు. అప్పటి నుండి పాఠశాలను అభివృద్ది పదంలో నడిపించేందుకు కృషి చేశారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం విద్యార్ధుల సంఖ్య పెరగడంతోపాటు 10వ తరగతి ఫలితాల్లోనూ గణనీయంగా పెరిగింది. ఆరు సంవత్సరాల్లో 100మంది విద్యార్ధులకు ఉపకార వేతనం సాధించారు. హైదరాబాద్ విద్యాఫౌండేషన్‌చే రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైకోర్టు న్యాయమూర్తిచే సన్మానం పొందారు.
2014-15విద్యా సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఇద్దరు విద్యార్ధులకు ప్రతిభా పురష్కారాలు పొందారు. పాఠశాల విద్యార్ధులను జిల్లా, రాష్ట్రస్థాయిలో చిత్రలేఖన పోటీల్లో సిల్వర్, గోల్డ్ మెడల్స్ సాధించారు. కడప ఫైన్ ఆర్ట్స్ అకాడమిచే ఉత్తమ ప్రధానోపాధ్యాయుని అవార్డు పొందారు. పాఠశాలలో ఎన్‌సిసి ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చారు. కంప్యూటర్, డిజిటల్, వర్చువల్ తరగతులతో విద్యార్ధులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చారు. చదువులతోపాటు ఆటలు, ఇతర సామాజిక అంశాలలో పాల్గనే విధంగా ప్రోత్సహించారు. పాఠశాల స్థాయి నుండి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు వివిధ పోటీల్లో పాల్గొనేలా విద్యార్ధులను ప్రోత్సహించారు. నీరు-చెట్టు, బడిబాట, ఆక్షరాస్యత వంటి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాభివృద్దికి సహకరిస్తూ శాసన సభ్యులు ఆమంచి కృష్ణమోహన్, అన్నా రాంబాబుచే సన్మానం పొందారు. పాఠశాల ఆవరణలో సరస్వతీదేవి విగ్రహం, స్టేజి నిర్మాణం, జెండా దిమ్మ ఏర్పాటు, సైకిల్ స్టాండు వంటివి నిర్మించారు. స్వచ్ఛ పాఠశాల, స్వచ్ఛ గ్రామం కార్య్రక్రమాలు చేయించారు. మండల విద్యాశాఖాధికారిగా పనిచేసిన కాలంలో మండలంలోని అన్ని పాఠశాలల అభివృద్దికి తోడ్పాటు అందించి ఉపాధ్యాయులను మన్ననలు పొందారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక కావడంపట్ల పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.