– అమెరికా ఫిలడెల్ఫియా నగరంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు
– పేదలు, రైతుల పాలిట దేవుడు వైఎస్ఆర్ అన్న నేతలు
– వైఎస్ఆర్ అంటేనే ఒక నమ్మకమన్న ఆశాభావం
అమెరికా : ఆంద్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి భారత రత్న ఇవ్వాలని కోరుతూ కోటి సంతకాల ఉధ్యమం చేపట్టనున్నట్లు నాటా వైఎస్ఆర్ ఫౌండేషన్ ప్రకటించింది. అమెరికా ఫిలడెల్ఫియా నగరంలోని నాటా కన్వెన్షన్ హాలులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జయంతి సభకు నాటా అధ్యక్షులు ఆళ్ల రామిరెడ్డి అతిధులను సభాపరిచయం చేసి వేదికపైకి ఆహ్వానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా నినాదంతో రాజీనామా చేసిన తాజా మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ రైతు పక్షపాతి అని పేర్కొన్నారు. జీవిత కాలం మొత్తం పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల కోసం తపించిన మహానాయకుడని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుని హోదాలో జార్జి బుష్ ఆంద్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు రంగారెడ్డి జిల్లాలో రైతుల వద్దకు బుష్‌ను తీసుకెళ్లారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలేమిటో బుష్ పర్యటనతో ప్రపంచానికి తెలియజెప్పారని అన్నారు. వైఎస్ఆర్ తరహాలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్ ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ చిన్నవయస్సులోనే గొప్పనాయకుడిగా ఎదిగారని చెప్పారు.
తాజామాజీ ఎంపి మిధున్‌రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకంతో పేదలకు బ్రతుకుపై బరోసా ఇచ్చి ఎందరికో ప్రాణాలు నిలిపిన దేవుడు డాక్టర్ వైఎస్ఆర్ అని వైఎస్ఆర్ పథకాలు గుర్తు చేశారు. పేదల కుటుంబాల నుండి విద్యార్ధులు ఇంజనీరింగ్, డాక్టర్ చదివి అమెరికా రాగలుతున్నారంటే వైఎస్ఆర్ అమలు చేసిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం వంటి సంక్షేమ పథకాలే కారణమన్నారు. పేదలకు ఆరోగ్య బరోసా ఇచ్చిన ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ఇప్పటి టిడిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసి పేదలను అబద్రతలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ఆర్ అంటేనే ఒక నమ్మకమని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. నేనున్నాననే బరోసా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కలిగించిన నేతని వైఎస్ఆర్ అని చెప్పారు. ఎంఎల్ఎ రవీంద్రనాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలమనిషిగా, ప్రజలకోసం పనిచేసిన నేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు నేడు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారని చెప్పారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తాను ఎంఎల్ఎగా గెలిచానని ఎంఎల్ఎ గౌరు చరిత పేర్కొన్నారు. వైఎస్ఆర్ తనను సొంత చెల్లెలుగా చూసుకున్నారని చెప్పారు. 2004నుండి 2009వరకు అత్యధిక నిధులు ఇచ్చినందునే తన నియోజకవర్గంలో అభివృద్ది పనులు చేయగలిగానని చెప్పారు. అన్నగా తమ కుటుంబానికి అండగా ఉన్న వైఎస్ఆర్ లేని లోటు తమను ఎప్పటికీ వెంటాడుతుందని భావోద్వేగానికి గురయ్యారు. బాపట్ల ఎంఎల్ఎ కోన రఘుపతి మాట్లాడుతూ వైఎస్ఆర్ వంటి నేతలు అరుదుగా ఉంటారని అన్నారు. వైఎస్ఆర్ పేరు ఎప్పుడు విన్నా వంటిపై రోమాలు నిక్కపొడుచుకుంటాయన్నారు. తెలియని ధైర్యం వస్తుందన్నారు. తాము పర్యటించే క్రమంలో ఏ గ్రామానికి వెళ్లినా చొక్కాలు తీసి ఆపరేషన్లు చేయించుకున్న గుర్తులు చూపి వైఎస్ఆర్ తమకు ప్రాణం పోసిన దేవుడని చెప్పి కంట తడి పెడుతున్నారని చెప్పారు. నెల్లూరు ఎంఎల్ఎ అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలుగు జాతి చరిత్ర ఉన్నంతవరకు వైఎస్ఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుందన్నారు. 2003కు ముందు ముగ్గురు ఆడపిల్లలకు వినికిడి వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య చేసుకోగా 2004లో అధికారానికి వచ్చిన వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీతో ముగ్గురు పిల్లలకు వైద్యం చేయించుకున్న తల్లి ముగ్గురు బిడ్డలతో జగన్ పాదయాత్రలో పాల్గొన్న సన్నివేశాన్ని గుర్తు చేశారు. శిల్పచక్రపాణి మాట్లాడుతూ రామాయణం, మహాభారతంలా వైఎస్ఆర్ చరిత్ర ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఉంటుందని, వినాలనిపిస్తుందని చెప్పారు.
వైఎస్ఆర్ చిరకాల మిత్రులు డాక్టర్ ప్రేమ్‌సాగరరెడ్డి వైఎస్ఆర్‌తో తనకున్న అనుబంధాన్ని, కాలేజీ రోజులనాటి ఘటనలను సభకు హాజరైన వారితో పంచుకున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ విద్యార్ధి దశనుండే నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నాడని చెప్పారు. అలుపెరగని పోరాటంతో ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. చరిత్రలో నిలిచిపోయే పనులు అనేకం చేశారన్నారు. వైఎస్ఆర్ మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో గొప్ప పాలనాదక్షునిగా పేరుతెచ్చుకున్న వైఎస్ఆర్‌కు భారతరత్న ఇవ్వడానికి పూర్తి అర్హుడని చెప్పారు. వైఎస్ఆర్‌కు భారత రత్న ఇవ్వాలని కోరుతూ కోటి సంతకాల ఉద్యమం అమెరికా గడ్డపైనుండే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నాటా ఉత్సవాల్లో పాల్గొనాల్సిన వైఎస్ జగన్ పాదయాత్ర కారణంగా హాజరు కాలేకపోయినప్పటికీ వచ్చే నాటా ఉత్సవాల్లో ముఖ్యమంత్రి హోదాలో పాల్గొంటారని హర్షధ్వనాల మద్య ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన ఎంపిలతోపాటు వైసిపిలో చేరిన శిల్పా చక్రపాణిరెడ్డి తన ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేయడంపట్ల అభినందించారు. సభలో రమేష్ చేసిన వైఎస్ఆర్, వైఎస్ జగన్ మిమిక్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.