Home ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో తెలుగు ప్రజల కీర్తి పతాకం

జాతీయ స్థాయిలో తెలుగు ప్రజల కీర్తి పతాకం

478
0

– నేలకొండపల్లి (చెర్వుమాధారం) గాయత్రి గ్రానైట్ నుండి తీసిన రాయితో భారీ పోలీసు స్మారకం
– పోలీస్ అమర వీరుల దినోత్సవం సందర్భంగా జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

ఢిల్లీ : ఖమ్మం కేంద్రంగా గ్రానైట్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఎగుమతులతో ప్రత్యేకతను చాటుకుంటున్న గ్రానైట్స్ మరోసారి తన కీర్తిని చాటుకుంది. గ్రానైట్తో దేశ రాజధాని ఢిల్లీలో రూపుదుడ్డుకున్న జాతీయ పోలీసు స్మారక చిహ్నంను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. భారీ గ్రానైట్ అందించిన ఖమ్మం జిల్లాకు చెందిన గాయత్రి గ్రానైట్స్ భాగస్వామ్య ప్రతినిధులను ప్రధాని ప్రత్యేకంగా ప్రశంచించారు.

వివరాల్లోకి వెళ్తే.. పోలీసు అమర వీరుల దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జాతీయ పోలీసు స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. 31 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పుతో 270 టన్నుల బరువున్న అతి భారీ గ్రానైట్ రాయితో ఈ స్మారక చిహ్నం రూపొందించారు. దీనికి అవసరమైన రాయిని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెర్వుమాధారంలో గల గాయత్రి గ్రానైట్స్ క్వారీ నుంచి వెలికి తీశారు. సుమారు మూడు నెలల పాటు శ్రమించి ఈ భారీ గ్రానైట్ ను సేకరించారు. అనంతరం కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారుల పర్యవేక్షణలో రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో 144 టైర్ల భారీ ట్రాలీలో ఢిల్లీకి తరలించారు. ఈ భారీ గ్రానైట్ రాయి ఢిల్లీ చేరుకోవడానికి 10రోజుల సమయం పట్టింది.

రాజధానికి సురక్షితంగా చేరుకున్న అనంతరం నిపుణులైన ఆర్కిటెక్చర్, పని బృందం ఆధ్వర్యంలో భారీ గ్రానైట్ ను నిలబెట్టి ముందు భాగంలో స్మారక చిహ్నం మలిచారు. న్యూఢిల్లీలోని చాణక్యపురిలో గల పోలీసు స్మారక కేంద్రంలో బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ, కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ స్ధూపాన్ని ఆదివారం జాతికి అంకితం చేశారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు గాయత్రి గ్రానైట్స్ యాజమాన్య ప్రతినిధులను ఆహ్వానించి, వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి గాయత్రి గ్రానైట్స్ నుంచి అధినేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), యాజమాన్య ప్రతినిధులు వద్దిరాజు వెంకటేశ్వర్లు, వద్దిరాజు నిఖిల్, అనీల, నాగరాజు, గంగుల సందీప్, సంతోష్ తోష్నివాల్, నజీర్ అహ్మద్ తదితరులు హాజరయ్యారు.

గర్వంగా ఉంది : గాయత్రి రవి
ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన పోలీసులను స్మరించుకునే చిహ్నం కోసం మా సంస్థ నుంచి గ్రానైట్ రాయి అందించడం గర్వకారణంగా ఉందని గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) అన్నారు. ఇంతటి మహత్తర కార్యంలో పాల్గొనడం మా సంస్థ అదృష్టం అన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు మా సంస్థ నుంచి కూడా అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. దేశ ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు గాయత్రి రవి ఈ సందర్భంగా నివాళులర్పించారు.