బాపట్ల : ఆయన మత్స్యసాగుల పరిశోధకులు, జీవ శాస్త్రవేత్త. 2005లో “వరల్డ్ ఫుడ్ ప్రైజ్” పొందారు. తక్కువ వ్యయంతో మంచినీటి చేపల వ్యవసాయంపై చేసిన అభివృద్ధికి ఈ బహుమతి ఆయనకు లభించింది. ఈ అవార్డు అందుకున్న ఆరవ భారతీయుడు, తొలి ఆంధ్రుడిగా చరిత్ర పుటలకెక్కారు.
గుంటూరు జిల్లా, బాపట్ల పట్టణంలో 1939, ఆగష్టు 17న జన్మించారు. ఎంఎస్సి డిగ్రీ అందుకున్న తరువాత చీరాల కాలేజీలో అధ్యాపకునిగా కొంతకాలం పనిచేసారు. ఆ తరువాత ఆస్సాం రాష్ట్రంలోని ఒక కళాశాలలో “జంతు శాస్త్ర శాఖాధిపతి”గా పనిచేసారు. ఆ కాలంలో ఆయన పరిశోధనలపై దృష్టి సారించారు. పరిశోధనలు చేస్తూ మరింత అభివృద్ధి సాధించడానికి కలకత్తా వెళ్ళి “ఫిషరీస్ రీసెర్చి”లో ప్రవేశించారు.
వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) తరపున మత్స్య సాగులకు అందించిన అపురూపమైన సేవలను ఐక్యరాజ్య సమితి గుర్తించి మత్స్య శాస్త్ర నిపుణుడిగా ప్రపంచ దేశాలకు మరింత కృషి జరిపేందుకు, పరిశోధనలు చేసి ఫలాలను రాబట్టడానికి అవకాశం కల్పించింది. కన్సల్టేటివ్ గ్రూపు ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి (పెనాంగ్, మలేసియా) అధ్వర్యంలోని మత్స్య పరిశోధన సంస్థ వరల్డ్ ఫిష్ కు అసిస్టెంట్ డైరక్టరుగా పనిచేసి పదవీవిరమణ చేసారు.
ఈయనకు కిరిబాటి దీవుల అధ్యక్షుడు అనోట్ టాంగ్ శుక్రవారం 2015ఆగష్టు 29న కొరియా శాంతి బహుమతిని, రూ.3.30 కోట్ల ప్రైజ్ మనీ అందజేశారు.