హైదరాబాద్ : ఈ రాష్ట్రంలో తనకు తిరుగే లేదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో వాస్తవమెంతో తేలనుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మాదే గెలుపు అనే సీఎం మాటల్లో నిజమెంతో ఋజువయ్యే టైమ్ వచ్చేసింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. గ్రామ పంచాయతీల ఎన్నికలు జూలై నెలాఖరులోగా నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రస్తుత పాలకమండళ్ల గడువు ఆగస్టు ఒకటిన ముగియనుంది. దీంతో ఎన్నికలు ఆ లోగానే జరగాలని, వెంటనే కొత్త పాలక మండళ్లు కొలువు తీరాలని ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల ఏర్పాట్లపై టిఎస్‌ఈసీ ఇటీవల అధికారులతో సమావేశం నిర్వహించింది.
ఎన్నికలను 2 లేదా 3 విడతల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన నమూనా ఎన్నికల షెడ్యూల్‌ను కూడా జారీ చేసింది. ఈ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల అధికారిగా పంచాయతీరాజ్ కమిషనర్, జిల్లా ఎన్నికల అథారిటీగా జిల్లాల కలెక్టర్లు వ్వహరిస్తారని టిఎస్‌ఈసీ ప్రకటించింది. పంచాయతీలకు ఎన్నికలు ఒక విడతలో నిర్వహిస్తే కనీసం 15 రోజులు, రెండు విడతల్లో నిర్వహిస్తే 19 రోజులు, మూడు విడతల్లో నిర్వహిస్తే 23 రోజుల నిడివి అవసరమని ఎస్‌ఈసీ ప్రణాళికలో పేర్కొంది.
షెడ్యూల్‌ను జూన్ ఒకటిన ప్రారంభిస్తే ఎలా ఉంటుందో నమూనా షెడ్యూలులో వివరించింది. నమూనా షెడ్యూల్‌ను చూసి ఎన్నికల షెడ్యూల్ జారీ అయిందనే ప్రచారం జరిగింది. అయితే, ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మరికొన్ని ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉండటంతో జూన్ రెండో వారంలో అధికారిక షెడ్యూల్ వెలువడుతుందని అధికారులు చెబుతూన్నారు. దీన్ని బట్టి సార్వత్రిక ఎన్నికలకు ముందే తెలంగాణలో అధికార టిఆర్ఎస్ సత్తా ఏమిటో ప్రజాబలం ఎంతో తేలనుంది.
ఎన్నికల సంఘం ఇచ్చిన గదువులోపు ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధపడితే ఇక ఈ ఏడాది మొత్తం రాష్ట్రంలో ఎన్నికల వేడి రగలనుంది. రాష్ట్రంలో తమను కొట్టేవారే లేరని, కాంగ్రెస్ను ప్రజలు నమ్మడం లేదని, బీజేపీకి రాష్ట్రంలో బలం లేదని కేసీఆర్ బల్లగుద్ది చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తమదే విజయమని తమ దరిదాపుల్లోకి కూడా విపక్షాలు రావన్న ధీమాతో ఉన్న కేసీఆర్ సార్వత్రిక ఎన్నికలకు ముందే తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఒకవైపు ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేస్తున్న కేసీఆర్ కు ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాల్సిరావడం ఎలాంటి పరిణామాలకు దారి టిస్తుందో వేచి చూడాల్సిందే…