ఒంగోలు : వైఎస్ జగన్ విశ్వాసానికి మరో నేత బలయ్యారు. మాట తప్పని నేత కోసం ఆస్తులు కరగదీసుకుని నాలుగేళ్లు కష్టపడి… పార్టీని నిలబెడితే చివరకు ఆ నేతకు తీవ్ర అన్యాయం చేశారు. జగన్ నే నమ్ముకుని ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడిన అన్నదమ్ములకు జగన్ తన మార్కు విశ్వాసం చూపించారు. మాట తప్పని, మడమ తిప్పని నేత చేతిలో మరో ఇద్దరు అన్నదమ్ములు మోసపోయారు. మాట తప్పని, మడం తిప్పని నేతనే జగన్‌పై విశ్వాసంతో వచ్చాం. ఉద్యోగం వదిలేసి… ఆస్థులు కరగదీసుకుని నాలుగేళ్లుగా పార్టీని నిలబెట్టాం. నియోజకవర్గంలో పార్టీకి జెండాకట్టే దిక్కులేని రోజుల్లో జెండాగా నిలబడితే ఇప్పుడు ఎవ్వరో ఒకరిద్దరికి నచ్చలేదని తప్పుడు నివేదికలిస్తే వాటిని చూసి నమ్మి మోసం చేస్తే… చూస్తూ ఊరుకుండాలా? పార్టీ క్యాడర్ నావెంటే ఉంది. వాళ్ల విశ్వాసాన్ని దెబ్బతీశారు. రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగానైనా విజేతగా నిలుస్తామంటూ కొండేపి వైసిపి నేత వరికూటి అశోక్‌బాబు అధినేత నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. మొన్ననే గిడ్డి ఈశ్వరి ఉదంతం చూసాం. జగన్‌ను సోదరుడిలా భావిస్తే… తనను నిండా ముంచేసారని ఆమె ఆవేదన చూసాం. నిన్ననే గుంటూరు జిల్లాల్లో మర్రి రాజశేఖర్ ని చూసాం. జగన్ కోసం నాలుగేళ్లు ఆస్తులు కరగేసుకుని పని చేస్తే… చివరకు అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పార్టీని బతికిస్తే ఆయనకు జగన్ పొగ బెట్టారు. ఒక మహిళా నేతను తెచ్చి ఆయన పీకల మీద కటయి పెట్టారు. ఇక కొన్నాళ్లుగా ప్రకాశం జిల్లాలో పార్టీ కోసం పనిచేస్తున్న వరికూటి సోదరులకు తాజాగా జగన్ ఎర్తు పెట్టారు. ఉద్యోగాన్ని కూడా వదులుకుని కొండపిలో పార్టీ కోసం పని చేస్తున్న వరికూటి అశోక్‌బాబు కు జగన్ హ్యాండ్ ఇచ్చారు. పర్చూరు నియోజకవర్గంలో అంతా తానై చూసుకున్న గొట్టిపాటి భరత్‌కు కాదని రావి రామనాధంబాబును ఇన్‌ఛార్జిగా తీసుకొచ్చారు. ఇలా జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జీలనే కాదని మార్చేస్తున్న జగన్ తీరు చూస్తున్న మిగిలిన నియోజకవర్గాల నేతలు తలపట్టుకుంటున్నారు. ఇదే పరిస్తితి కొనసాగితే ఎవరి పరిస్థితి ఏమిటనే ఆందోళన ఇన్‌ఛార్జీల్లో మొదలైంది. ఎంత నమ్మకంగా పనిచేస్తున్నా చివరి నిమిషంలో ఎవరైనా ధనవంతులు పోటీకొస్తే తమ పరిస్థితి ఏంటనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అధినేత నిర్ణయంతో రగిలిపోయిన వరికూటి అశోక్‌బాబు జగన్ పై తీవ్ర విమర్శలు చేసారు. గుండె మండి మీడియా ముందుకొచ్చారు. “నాలుగేళ్లుగా ఉన్న అస్తులు కరిగిపోయాయి… ఇప్పుడు మీకు నేను నాయకుడిగా పనికిరాలేదా… మీకు బానిసలు కావాలని ఇన్‌చార్జి పదవి వేరొకరికి ఇస్తారా? ఇది సమంజసమా?” అని కొండపి వైసీపీ నేత వరికూటి అశోక్‌బాబు జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. కొండపిలోని సాయి సీతారామ కల్యాణ మండపంలో జరిగిన వరికూటి అనుకూల వర్గీయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు భాషలో చెప్పాలంటే పొగాకు చెట్టుకు చేటు చేసే పొగమల్లెలా ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తయారయ్యాడని ఘాటుగా విమర్శించారు. ప్రకాశం జిల్లాలో వైసీపీని అంతం చేయడం ద్వారా జగన్‌కు చెడు చేస్తున్నాడు. అప్పుతెచ్చానో? ఉన్నదే కాజేసుకున్నానో నాలుగు కోట్లు పార్టీ కోసం వెచ్చించాను.. కనీసం దయలేదా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
దళితుల రక్తమాంసాల మీద ఎంపీ కోట కట్టుకుంటారా? ఒక్క దళితులకే కాదు, బీసీలకు అన్యాయం చేస్తావా? అంటూ వైవీని దుమ్మెత్తి పోశారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆస్తులు వైవీ రాయించుకుంటే జగన్ పిలిచి చీవాట్లు పెట్టి, తిరిగి ఆస్తులు ఇప్పించాడని చెప్పారు. చీము, నెత్తురు ఉంటే ప్రజాక్షేత్రంలోకి వైవీ రావాలని పరుషంగా డిమాండ్ చేశారు. నాయకుడంటే వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డేనని, డబ్బులు ఉన్నా? లేకపోయినా? ప్రజాక్షేత్రంలోకి వాసన్న వస్తే జన ఉప్పెన వస్తుందన్నారు. నియోజకవర్గంలో ఎస్సీ అభ్యర్థిని కాకుండా ఇతర అభ్యర్థిని నిలబెట్టగలవా? అంటూ ప్రశ్నించారు.
నీ చెంచాలు, బానిసలు కావాలనుకుంటే పార్టీ కార్యక్రమాలు, జెండాలు, భోజనాలు, టీల ఖర్చులు కూడా నాలుగేళ్లు నీవే పెట్టుకోకూడదా? అని సుబ్బారెడ్డిని ఉద్దేశించి అన్నారు. అంతకుముందు అయిదు మండలాల కన్వీనర్లు, వైసీపీ నాయకులు స్వతంత్ర అభ్యర్థిగా వరికూటి అశోక్‌బాబు బరిలోకి దిగాలని కోరారు. ఆ మాటలను ఉదహరిస్తూ నేను స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా మీ సొంత (కార్యకర్తలనుద్దేశించి) అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. అశోక్‌బాబు భార్య లక్ష్మి, నాయకులు ఢాకా పిచ్చిరెడ్డి, ఆరికట్ల వెంకటేశ్వర్లు ఇతర నాయకులు మాట్లాడారు. సమావేశానికి పొన్నలూరు మండల వైసీపీ కన్వీనర్ మినహా అందరూ హాజరయ్యారు. అశోక్ బాబు సోదరుడు వరికుటి అమృతపాని కూడా పోయిన ఎన్నికల్లో బాపట్ల ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నాలుగేళ్లుగా పార్లమెంటు పరిధిలో పార్టీ బాధ్యతలు చూస్తూ వచ్చారు. జగన్ ప్రజాసంకల్ప యాత్ర సమయంలో కుటుంబంలో ఇద్దరిలో ఎవరో ఒకరే తేల్చుకోవాలని చెప్పడంతో అమృతపాణి తమ్ముడు అశోక్‌కే అవకాశం ఇవ్వాలని తన స్థానం వదులుకునేలా చూసిన జగన్ ఇప్పుడు అశోక్‌బాబుకు కూడా లేదని అన్యాయం చేయడంపట్ల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.