– జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసిపి గ్రూపులు
– అభ్యర్ధుల ప్రకటనతో ఆశావహులకు కళ్లెం, గ్రూపులకు చెక్
– జనం రాకున్నా ఫర్వాలేదు… గ్రూపులొద్దు
– జిల్లాలో సాగుతున్న జగన్ ప్రజాసంకల్ప యాత్ర
ఒంగోలు : వైఎస్ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ జిల్లాకు రాకముందు అన్ని నియోజకవర్గాల్లో ఎంతోకొంత గ్రూపుల పోరు నడిచింది. పార్టీ ఇన్‌ఛార్జిలుగా ఉన్న అభ్యర్ధులకు పోటీగా తామున్నామంటూ ఆశావహులు గ్రూపులు నడిపారు. పోటీ కార్యక్రమాలు నిర్వహించారు. ఇన్‌ఛార్జిలుగా ఉన్నవ్యక్తులను తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కనిగిరి వంటి నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు మీటింగులూ పెట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎవరు అభ్యర్ధి అవుతారనే సందిగ్దత నెలకొంది. సామాజికవర్గాల పొందికలో అక్కడున్న ఇన్‌ఛార్జిని మార్చుతారు, ఇక్కడ మరొకరికి అవకాశం వస్తుందని విశ్లేషించారు. జిల్లాలో జగన్ ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా ఇలాంటి గ్రూపుల పోరుకు చెక్ పెట్టేస్తున్నారు. వివాదాలు నడుస్తున్న నియోజకవర్గాల్లో ఈ పాటికే అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో బహిరంగంగా అభ్యర్ధులను ప్రకటించనప్పటికీ అభ్యర్ధి హోదాతోనే జగన్ ప్రాధాన్యత ఇస్తూ జనంలో పరిచయం చేస్తున్నారు. ఇలా మందుకూరు నియోజకవర్గంలోని రాళ్లపాడు ప్రాజెక్టు మీదుగా జిల్లాలోకి ప్రవేశించిన జగన్ యాత్ర వేల సంఖ్యలో జనంతో సాగుతుంది. కందుకూరు, కనిగిరి నియోజకవర్గాల్లో జనం అట్టహాసం చేశారు.
కనిగిరి నియోజకవర్గంలో ఇన్‌ఛార్జిగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్‌ను ఇన్‌ఛార్జిగా తొలగించాలని జగన్ యాత్రకు ముందు వైసిపికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు కొందరు, పార్టీ కార్యకర్తలు, సర్పంచులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బుర్రాను తొలగించాలని డిమాండు చేశారు. తొలగించకుంటే తామే రాజీనామా చేస్తామని ప్రకటించారు. కానీ జగన్ పాదయాత్ర ఆసాంతం బుర్ర మధుసూధన్ ఏర్పాట్లు చేశారు. కనిగిరి పట్టణంలోని చర్చి సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో నేరుగా జగనే వెండి కత్తిని బుర్రా చేతికి ఇచ్చి బుర్రానే అభ్యర్ధి అన్నట్లు జనంలో విజయ సంకేతం చూపించారు. అలా చెప్పకనే బుర్రాను అభ్యర్ధిగా ప్రకటించారు. ఆతర్వాత పొదిలి మీదుగా దర్శి చేరుకున్న జగన్ దర్శిలోనూ బూచేపల్లి శివప్రాద్‌రెడ్డికి ప్రత్యామ్నయంగా అభ్యర్ధిని ప్రకటించారు. దర్శి నుండి అద్దంకి, జాతీయ రహదారిమీదుగా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు చేరుకున్నారు.
ఇంకొల్లులోనూ జరిగిన బహిరంగ సభలో పర్చూరు నియోజకవర్గ వైసిపి అభ్యర్ధిగా రాంబాబుచౌదరిని ప్రకటించారు. జగన్ రాకకు వారం రోజుల ముందు అప్పటి వరకు ఇన్‌చార్జిగా ఉన్న గొట్టిపాటి భరత్ కార్యకర్తల సమావేశం పర్చూరులో నిర్వహించారు. పార్టీలోకి కొత్తవారిని తీసుకుంటారనే అపోహలు వద్దనికి ఆయన అనుచరులకు చెప్పుకున్నారు. తానే వచ్చే ఎన్నికలలో అభ్యర్ధినని తనకు తానే కార్యకర్తల సమక్షంలో ప్రకటించుకున్నారు. అతను ప్రకటించుకున్న పదిరోజులకు ఇంకొల్లుకు చేరుకున్నజగన్ ప్రజాసంకల్ప యాత్ర సభలో అభ్యర్ధిగా వేరొకరిని ప్రకటించారు. పర్చూరు నియోజకవర్గంలో ఆశించినంత జనం పాదయాత్రకు రాకపోయినా జగన్ వివాదాలను తుంచేసుకోవడంలో చేసిన సాహసమైన నిర్ణయాలు ప్రత్యర్ధి టిడిపినేతలకు ఆనందం కలిగించింది. జగన్ వివాదాలను తొక్కేసేందుకు చేస్తున్న నిర్ణయాలతో జనం రాకపోవడానికి ఎంఎల్ఎ ఏలూరి సాంబశివరావుకు నియోజకవర్గంలో పట్టున్నందునే జగన్ సభలకు జనం రాకుండా చేయగలిగారనే ప్రచారం చేసుకున్నారు. పర్చూరు నియోజకవర్గంలో ఎంఎల్ఎ ఏలూరి సాంబశివరావువెంట మెజారిటీ టిడిపి కార్యకర్తలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నుండి టిడిపిలోకి వచ్చిన వారికే పనులు బాగా అవుతున్నాయని, టిడిపిని నమ్ముకున్న పాత తరం టిడిపి కార్యకర్తలకు పనులు కావడంలేదనే అసహనం ఉన్న అంశాన్ని మరుగునపెట్టి జగన్ సభకు జనం రాకపోవడం ఏలూరిపై జనంలో ఉన్న పట్టుకు నిదర్శనంగా చెప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.
చీరాల నియోజకవర్గంలోనూ పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న యడం బాలాజీకి పోటీగా ఎంపి అభ్యర్ధిగా గత ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటు ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న డాక్టర్ వరికూటి అమృతపాణి పోటీ కార్యక్రమాలు నిర్వహించారు. ఇద్దరి మద్య సఖ్యత కుదరలేదు. ఇద్దరూ ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. పార్టీ రెండుగా చీలింది. కొందరు కౌన్సిలర్లు అమృతపాణి వెంట ప్రయాణించారు. పార్టీ ఇన్‌ఛార్జిలకు పోటీ కార్యక్రమాలు చేస్తున్నారన్న కారణంతో కావచ్చు లేక ఇతర కారణాలేమైనా కావచ్చు బాపట్ల పార్లమెంటు ఇన్‌చార్జిగా వేమూరు నియోజకవర్గానికి చెందిన రమేష్ అనే వ్యక్తిని జగన్ ప్రజాసంకల్ప యాత్రలో వారం రోజుల క్రితంమే ప్రకటించడం నియోజకవర్గ వైసిపి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ యాత్రకు జన సమీకరణ చేయాలని అంబేద్కర్ భవన్‌లో సన్నాహక సమావేశం జరిపిన అమృతపాణి వర్గీయులు ఇప్పుడు జగన్ యాత్రలో ఏలాంటి పాత్ర పోషిస్తారో వేచి చూడాలి. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న యడం బాలాజీ మాత్రం ఆయన వెంట ఉన్న పార్టీ కార్యడర్‌తోనే జగన్ యాత్రకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో వివాదాలు నడిచిన చోట అభ్యర్ధులను ప్రకటిస్తూ వచ్చిన జగన్ చీరాల పర్యటనలో ఎలాంటి ట్విస్ట్‌లు ఇస్తారో వేచి చూడాల్సిందే.